Begin typing your search above and press return to search.

ప్రతీకారం తీర్చుకోవాల్సిందే.. ఇరాన్ అగ్రనేత ఆదేశాలు

ఇలాంటి వేళ.. తమ దేశానికి వచ్చిన అతిధిని.. ముఖ్య మిత్రుడ్నిమట్టు పెట్టిన వైనంపై ఇరాన్ సీరియస్ గా ఉంది.

By:  Tupaki Desk   |   1 Aug 2024 6:09 AM GMT
ప్రతీకారం తీర్చుకోవాల్సిందే.. ఇరాన్ అగ్రనేత ఆదేశాలు
X

అనుకున్నదే జరుగుతోందా? అంచనాలకు తగ్గట్లే.. పశ్చిమాసియాలో మరో అశాంతికి తెర లేచినట్లేనా? రావణకాష్టంలా మండే పశ్చిమాసియాలో మరింత రక్తపాతం జరగనుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. హమస్ అగ్రనేతను ఇరాన్ లో మట్టుబెట్టటం.. దానికి కారణం ఫలానా అన్నది తేలకున్నా.. వేళ్లన్నీ కూడా ఇజ్రాయెల్ వైపే చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. తమ దేశానికి వచ్చిన అతిధిని.. ముఖ్య మిత్రుడ్నిమట్టు పెట్టిన వైనంపై ఇరాన్ సీరియస్ గా ఉంది.

తమ దేశంలో చేపట్టిన హత్యాకాండకు బదులు తీర్చుకోవాల్సిందేనన్న పంతంలో ఇరాన్ ఉన్నట్లు చెబుతున్నారు. హమస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ మీద ప్రత్యక్ష దాడికి ఇరాన్ అగ్రనేత అయతుల్లాఅలీ ఖమేనీ ఆదేశాలు జారీ చేసినట్లుగా దిగ్గజ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. తమ దేశంలో హమస్ అగ్రనేతను మట్టుబెట్టిన ఉదంతం బయటకు వచ్చినంతనే.. ఇరాన్ భద్రతా మండలి అత్యవసర భేటీని నిర్వహించింది.

ఈ సమావేశంలోనే ప్రత్యక్ష దాడికి ఇరాన్ అగ్రనేత ఆదేశాలు ఇచ్చినట్లుగా పేర్కొంది. హమస్ అగ్రనేత హత్యకు గురి కావటం.. అందుకు ఇరాన్ వేదిక కావటం పెను సంచలనంగా మారింది. దీనికి ఒక లింకు ఉందంటున్నారు. ఇటీవల కాలంలో హమస్ అగ్రనేత పలు దేశాల్లో పర్యటించినా.. అక్కడ ఏమీ జరగకున్నా.. ఇరాన్ కు వచ్చిన ఆయన్ను మట్టుబెట్టటం వెనుక ఉన్న కారణం కీలకంగా చెబుతున్నారు.

ఆ మధ్యన ఇజ్రాయెల్ మీద దాడికి పాల్పడి.. ఇజ్రాయెల్ పౌరుల్ని పెద్ద ఎత్తున చంపేయటం.. పలువురిని ఎత్తు కెళ్లిపోవటం లాంటి దారుణ ఘటనకు కారణమైన హమస్ కు అప్పట్లో మద్దతు ఇచ్చింది ఇరాన్ గా ఆరోపణ ఉంది. అందుకే.. తమను టార్గెట్ చేసిన హమస్ ను కుప్పకూలుస్తామని.. తమపై జరిగిన దాడికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్న ఇజ్రాయెల్ ప్రతినలో భాగంగానే.. తాజా హత్యగా చెబుతున్నారు.

హమస్ అగ్రనేత.. అతడికి సహకారం అందించిన ఇరాన్ రెండింటిని దెబ్బ తీయాలన్న లక్ష్యంతోనే.. హమస్ అగ్రనేత ఇరాన్ లో ఉన్న టైంలో హత్య చేయటం ద్వారా.. తమ ప్రతీకారం ఎంత తీవ్రంగాఉంటుందన్న విషయాన్ని ఇజ్రాయెల్ చేతల్లో చూపించిందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. దీనికి బదులుగా ఇజ్రాయెల్ కు పాఠం నేర్పాలన్న పట్టుదలతో ఇరాన్ ఉందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.