తాజ్ మహల్ వెనక్కు, అయోధ్య ముందుకు... ఇవిగో లెక్కలు!
అవును... ఒకప్పుడు ఆగ్రాలోని తాజ్ మహల్ దేశంలోని పర్యాటక రంగంలో అగ్రగామిగా ఉండగా.. తాజాగా ఆ స్థానాన్ని అయోధ్య రామాలయం ఆక్రమించిందని యూపీ ప్రభుత్వం ప్రకటించింది.
By: Tupaki Desk | 21 Dec 2024 12:30 AM GMTఈ ఏడాది జనవరి 22న అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అయోధ్య రామమందిరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.
రామమందిర నిర్మాణంతో ఈ ఏడాది ప్రారంభం నుంచి అయోధ్య అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అయోధ్య రామమందిరం సరికొత్త రికార్డ్ సొంతం చేసుకుంది. ఇందులో భాగంగా దేశంలోని మోస్ట్ పాపులర్ పర్యాటక కేంద్రంగా అయోధ్య నిలిచినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.
అవును... ఒకప్పుడు ఆగ్రాలోని తాజ్ మహల్ దేశంలోని పర్యాటక రంగంలో అగ్రగామిగా ఉండగా.. తాజాగా ఆ స్థానాన్ని అయోధ్య రామాలయం ఆక్రమించిందని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది తొలి 9 నెలల్లోనూ రికార్డ్ స్థాయిలో పర్యాటకులు అయోధ్యను సందర్శించారని గణాంకాలు విడుదల చేసింది.
ఈ సందర్భంగా స్పందించిన యూపీ టూరిజం మినిస్టర్ జైవీర్ సింగ్... అయోధ్య రామ మందిరాన్ని చూసేందుకు దేశీయంగానే కాకుండా, విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున సందర్శకులు తరలి వచ్చారని అన్నారు. ఈ క్రమంలోనే... ఆలయం ప్రారంభమైన ఏడాది లోపే తాజ్ మహల్ రికార్డును అధిగమించింది.
ఇక గణాంకాల విషయానికొస్తే... 2024 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య అయోధ్యను సందర్శించిన దేశీయ పర్యాటకుల సంఖ్య 13.55 కోట్లు కాగా.. విదేశీ పర్యాటకుల సంఖ్య 3,153 అని ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో... తాజ్ మహల్ ను దేశీయ, విదేశీ పర్యాటకులు కలిసి 12.51 కోట్ల మంది సందర్శించారు.
ఇదే సమయంలో... ఉత్తరప్రదేశ్ లోని పర్యాటక కేంద్రాలను జనవరి – సెప్టెంబర్ మధ్య 47.61 కోట్ల మంది టూరిస్టులు సందర్శించారని తెలిపిన రాష్ట్ర టూరిజం శాఖ.. గత ఏడాది 12 నెలల్లోనూ 48 కోట్లు కాగా.. ఈ ఏడాది 9 నెలల్లోనే అందుకు చేరువగా వెళ్లినట్లు వెల్లడించింది.