అయోధ్య రాముడికి ‘సూర్య’తిలకం.. చూసి తీరాల్సిన అద్భుతం
నేడు దేశమంతా శ్రీరామ నామస్మరణతో పులకించిపోతోంది. భక్తులు రామయ్య ఆలయాలకు పోటెత్తారు.
By: Tupaki Desk | 6 April 2025 10:18 AMనేడు దేశమంతా శ్రీరామ నామస్మరణతో పులకించిపోతోంది. భక్తులు రామయ్య ఆలయాలకు పోటెత్తారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగలా జరుగుతున్నాయి. గత ఏడాది జనవరిలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత ఇది రెండవ శ్రీరామనవమి. ఈ శుభ సందర్భంగా అయోధ్య ఆలయంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి విగ్రహం నుదిటిపై సూర్య కిరణాలు తిలకంలా ప్రకాశించాయి. ఈ అపురూప ఘట్టాన్ని భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో తిలకించారు. ఆలయ నిర్మాణం సమయంలోనే సూర్య కిరణాలు స్వామివారి నుదిట తిలకం దిద్దేలా శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా రూపొందించారు. ఈ అద్భుత దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయోధ్య రామాలయం నిర్మాణం అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు, నిపుణులు మరియు కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు సంయుక్తంగా అయోధ్య రామాలయంలో ఈ సూర్య తిలకం వ్యవస్థను ఏర్పాటు చేశారు. గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు పడేలా దీనిని రూపొందించారు.
-కటకాలతో ప్రత్యేక ఏర్పాట్లు:
రామయ్య విగ్రహం నుదుటిపై సూర్య కిరణాలు పడటానికి ఆలయం మూడవ అంతస్తులో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. కుంభాకార - పుటాకార కటకాలను ఉపయోగించి, వాటిని పైపులతో అనుసంధానించి ఒక ప్రత్యేకమైన విధానాన్ని రూపొందించారు. ఆలయం పైభాగంలో సూర్యకాంతిని గ్రహించడానికి ఒక పరికరం ఏర్పాటు చేశారు. అక్కడ గ్రహించిన కాంతి, పైపుల లోపల అమర్చిన కటకాల ద్వారా ప్రసరించి, బాలరాముడి నుదుటిపై అచ్చంగా తిలకం వలె కనిపిస్తుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
ప్రతి శ్రీరామ నవమి రోజున ఈ సూర్య తిలకం ఆవిష్కృతం అవుతుంది. దీని కోసం ప్రత్యేకమైన మెకానిజం ఉంది. గేర్ టీత్ మెకానిజం ద్వారా 365 రోజులు సూర్యకాంతిని గ్రహించే అద్దం కదులుతూ ఉంటుంది. సరిగ్గా శ్రీరామనవమి సందర్భంగా, అది నిర్ణీత స్థానానికి చేరుకుంటుంది, తద్వారా సూర్య కిరణాలు బాలరాముడి నుదుటిపై తిలకంలా పడతాయి. ఈ ఆలయ నిర్మాణంలో కేవలం వాస్తు శాస్త్రాన్నే కాకుండా, అనేక శాస్త్రీయ , సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారని స్పష్టమవుతోంది.
గత ఏడాది రాముడి ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత అయోధ్య రామాలయానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. కోట్లాది మంది భక్తులు అయోధ్యకు వచ్చి బాలరాముడిని దర్శించుకుని ఆయన ఆశీర్వాదాలు పొందుతున్నారు. మహాకుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కూడా యూపీలోని అయోధ్యకు వెళ్లి రాముడి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.