Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీల మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి...అళ్ళ క్లారిటీ

అయితే దీని మీద తాజాగా అయోధ్య రామిరెడ్డి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని ఆయన స్పష్టం చేశారు.

By:  Tupaki Desk   |   28 Jan 2025 11:15 AM GMT
వైసీపీ ఎంపీల మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి...అళ్ళ క్లారిటీ
X

వైసీపీ ఎంపీలలో ఇపుడు ఎవరు పార్టీని వీడిపోతారు అన్న చర్చ సాగుతోంది. పార్టీకి పునాది లాంటి విజయసాయిరెడ్డి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకున్నాక ఇక ఎవరైనా వెళ్తారు అన్నది జనంలో ఉన్న మాట. పార్టీ జనంలో అదే ఉంది.

ఇక వైసీపీ ఎంపీలలో మరికొందరు పార్టీని వీడిపోతారు అన్న చర్చ వస్తున్న నేపథ్యంలో ఆళ్ళ అయోద్య రామిరెడ్డి పేరు ప్రచారంలోకి వస్తోంది. ఆయన పార్టీని వీడడం ఖాయమని కూడా అంతా అనుకుంటున్న సందర్భం ఉంది.

అయితే దీని మీద తాజాగా అయోధ్య రామిరెడ్డి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను పార్టీ మారడం అన్నది జరుగుతున్న పుకారు లాంటి ప్రచారం మాత్రమే అని ఆయన కొట్టిపారేశారు.

దీని మీద మీడియాలో జరుగుతున్నది అంతా ఉత్త ప్రచారమే అని అన్నారు. రాజకీయాల్లో ఉన్నపుడు ఎవరికైనా ఒత్తిళ్ళు సహజం అన్నారు. వాటిని తట్టుకుని నిలబడాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ విధంగా చూసుకుంటే తమ మీద కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిళ్ళు ఉన్నాయని ఆయన చెప్పకనే చెప్పేశారు.

రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత వైసీపీ నేతల మీద పెద్ద ఎత్తున ఒత్తిడి పెరిగిందని ఆయన అన్నారు. వైసీపీ ఎంపీలు మాత్రమే కాదు, ఎమ్మెల్సీల మీద కూడా ఒత్తిడి బాగా ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే రాజకీయాల్లో ఉన్న వారికి ఇవి కామన్ అని ఆయన అన్నారు. విజయసాయిరెడ్డి పార్టీని వీడి వెళ్ళడం మీద ఆయనే క్లారిటీ ఇవాలని అయోధ్య రామిరెడ్డి అన్నారు. ఆయన ఎందుకు వెళ్ళారో తమకు తెలియదు అన్నారు.

అయితే వ్యక్తిగతంగా విజయసాయిరెడ్డి మంచివారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి ఎందుకు పార్టీని వీడారో చెప్పాలని వైసీపీ నేతలు అడుగుతున్నారు. మరి వారికి తెలియదా లేక ఎవరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా విజయసాయిరెడ్డి ఈ విధంగా రాజీనామా వ్యూహాన్ని అమలు చేశారా అన్న చర్చ సాగుతోంది. నిన్నటికి నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఇదే విషయం మీద మాట్లాడుతూ విజయసాయిరెడ్డిని డిమాండ్ చేసారు. విజయసాయిరెడ్డిని ఎవరు అప్రూవర్ గా మారమన్నారో చెప్పాలని కూడా కోరారు.

మొత్తానికి చూస్తే విజయసాయిరెడ్డి ఎపిసోడ్ వైసీపీని అతలాకుతలం చేస్తోంది. మిగిలిన ఎంపీల ఫిరాయింపుల సంగతి ఏమో కానీ అందరూ ఇపుడు తాము పార్టీ మారడం లేదు అని వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. మరో వైపు చూస్తే వైసీపీ ఎంపీలు అంతా పార్టీ గోడ దూకేస్తారు ఆ పార్టీలో ఎవరూ ఉండరు అని ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే అయోధ్య రామిరెడ్డి ఒక మాట చెప్పారు. తమ మీద తీవ్రమైన ఒత్తిడి ఉందని, దానిని తట్టుకోవాలని. అన్నారు.

మరి మరో నాలుగున్నరేళ్ళ పాటు ఈ విధంగా ఒత్తిడిని తట్టుకుని ఎంతమంది వైసీపీ వైపు ఉంటారు అన్న ప్రశ్నలు ఇపుడు ఉదయిస్తున్నాయి. రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి లాంటి వారే తీవ్ర ఒత్తిడి అని ఫీల్ అవుతూంటే దిగువ స్థాయిలో ఉన్న నేతలు కూడా ఇంకెంతలా ఫీల్ అవుతారో కూడా చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా అయోధ్య రామిరెడ్డి చెప్పిన దాని ప్రకారం చూస్తే వైసీపీ ఎంపీలు ఎమ్మెల్సీల మీద ఫుల్ టార్గెట్ ఉంది. మరి దీని నుంచి ప్రభావితమై ఎవరు గోడ దూకుతారు. ఎవరు తట్టుకుని పార్టీలో ఉంటారు అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.