Begin typing your search above and press return to search.

సామాన్యులకు అయోధ్య బాలరాముడి దర్శనం.. అదెలానంటే?

ఆహ్వానితులకు మాత్రమే అయోధ్యలోని బాలరాముడి దివ్య దర్శన భాగ్యం సోమవారం కలిగింది.

By:  Tupaki Desk   |   23 Jan 2024 5:11 AM GMT
సామాన్యులకు అయోధ్య బాలరాముడి దర్శనం.. అదెలానంటే?
X

ఆహ్వానితులకు మాత్రమే అయోధ్యలోని బాలరాముడి దివ్య దర్శన భాగ్యం సోమవారం కలిగింది. అయితే.. ఈ రోజు (మంగళవారం) నుంచి సామాన్యులు సైతం అయోధ్యలోని రాముడ్ని దర్శించుకునే భాగ్యం కలగనుంది. సోమవారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తైన నేపథ్యంలో.. ఇక నుంచి సామాన్యులను సైతం బాలరాముడ్ని దర్శించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన కీలక ప్రకటనను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది.

సామాన్య భక్తులకు సైతం దర్శనాన్ని కలిగించేందుకు అనుమతి ఇస్తామన్న ప్రకటనతో సోమవారం అర్థరాత్రి నుంచి భక్తుల హడావుడి మొదలైంది. దీంతో.. పెద్ద ఎత్తున బలగాల్ని మొహరించారు. రాముడి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఆధార్ తో సహా.. ఏదైనా గుర్తింపు కార్డును కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే వారికి దర్శన భాగ్యం కలుగుతుంది. అయితే.. స్వామి వారి దర్శనం కోసం ఆన్ లైన్ లోకానీ.. ఆఫ్ లైన్ లో కానీ పాస్ తీసుకున్న వారికి మాత్రమే దర్శనాన్ని కల్పిస్తారు. పదేళ్ల లోపు పిల్లలకు మాత్రం ఎలాంటి దర్శన పాస్ లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

దర్శనం వేళల్ని చూస్తే.. ఉదయం 7 గంటలకు మొదలు పెట్టి 11.30 గంటల వరకు ఉంటుంది. మళ్లీ మధ్యాహ్నం 2 గంటలకు మొదలై 7 గంటల వరకు అనుమతిస్తారు. ఇక.. జాగరణ హారతి పేరుతో ఉదయం 6.30 గంటలకు అవకాశాన్ని కల్పిస్తారు. దీని కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక.. రాత్రి 7.30 గంటలకు సంధ్యాహారతిని ఇస్తారు. దీని కోసం ఏరోజుకు ఆ రోజు బుక్ చేసుకునే వీలుంది.

బాలరాముడి దర్శనం కోసం కానీ.. ప్రత్యేక సేవ కోసం కానీ పాస్ సొంతం చేసుకోవటానికి ప్రొసీజర్ ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్ సైట్ కు వెళ్లాలి. మొబైల్ ఫోన్ తో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఓటీపీ జనరేట్ అవుతుంది. దీంతో.. రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. మై ప్రొఫైల్ లోకి వెళ్లి.. గుర్తింపు వివరాల్ని.. చిరునామాను నమోదు చేయాలి. తర్వాత హారతి లేదంటే దర్శనం టైం స్లాట్ ను ఎంపిక చేసుకోవాలి. ఆలయ ప్రాంగణంలోకి వెళ్లిన తర్వాత కౌంటర్లు పాస్ లు పొందే వీలుంటుంది. దీంతో.. దర్శనం పూర్తి చేసుకోవచ్చు.