Begin typing your search above and press return to search.

అయోధ్యకు పోటెత్తిన భక్తులు.. పాస్‌ లకు ఆన్‌ లైన్‌ బుకింగ్స్ ఇలా!

అయోధ్య రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సోమవారం నాడు అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   23 Jan 2024 5:01 AM GMT
అయోధ్యకు పోటెత్తిన భక్తులు.. పాస్‌ లకు ఆన్‌ లైన్‌ బుకింగ్స్ ఇలా!
X

అయోధ్య రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సోమవారం నాడు అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. దీంతో నేటి నుంచి సామాన్య భక్తులకు శ్రీరామచంద్రమూర్తి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం మూడు గంటల నుంచే నవనిర్మాణ రామాలయ ప్రధాన ద్వారం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.

అవును... అయోధ్య రామమందిర తలుపులు సామాన్య భక్తుల కోసం తెరుచుకున్నాయి. దీంతో... మంగళవారం ఉదయం నుంచి స్వామివారి దర్శన భాగ్యానికి సామాన్యులు పోటెత్తారు. దీంతో ఆలయ ముఖద్వారం వద్ద, ఆలయం పరిశరాల్లోనూ భారీగా భక్తుల రద్దీ కనిపిస్తోంది. దీంతో... స్వామివారి దర్శన సమయాన్ని పొడిగించాలని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ యోచిస్తోందని తెలుస్తుంది.

సోమవారం ప్రధాని మొడీ, యూపీ సీఎం, గవర్నర్, వీ.హెచ్.పీ. చీఫ్ లతో పాటు కొంతమంది వీఐపీలకు మాత్రమే దర్శన భాగ్యం కలిగిన నేపథ్యమో.. నేటి నుంచి సామాన్యులను స్వామివారి దర్శననానికి అనుమతిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో శ్రీరాముల వారి భక్తులు సోమవారం అర్ధరాత్రి నుంచే మందిరం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

ఈ సమయంలో... దర్శనం, హారతి వేళల వివరాలను ట్రస్ట్‌ తమ వెబ్‌ సైట్‌ లో వెల్లడించింది. ఇదే సమయంలో దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్‌ కార్డు వంటి ఏదైనా ఒక గుర్తింపు పత్రం వెంట తీసుకురావాలని తెలిపింది. ఇక ఇలా భారీస్థాయిలో భక్తులు పోటెత్తుతారని ముందే ఊహించిన ప్రభుత్వం భారీ ఎత్తున బలగాలను మొహరించింది.

ట్రస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం... ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనం వేళలు ఉన్నాయి. ఇక ఉదయం 6.30 గంటలకు జాగరణ హారతి, రాత్రి 7.30 గంటలకు సంధ్యా హారతి ఉంటుంద్ని తెలిపింది. వీటికి సంబంధించి బుక్కింగ్స్ ఒక రోజు ముందుగానే చేసుకోవాల్సి ఉంటుంది.

పాస్‌ లకు ఆన్‌ లైన్‌ బుకింగ్స్ ఇలా..!:

ఇక బాల రాముడి దర్శన, హారతికి సంబంధించిన పాస్ లను ఆన్ లైన్ లో బుక్ చేసుకునేందుకు... ముందుగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ అధికారిక వెబ్‌ సైట్‌ కు వెళ్లాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ తో సైన్ ఇన్ అయ్యి ఓటీపీ ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. అనంతరం ప్రొఫైల్ పై క్లిక్ చేసి పేరు, చిరునామా మొదలైన వివరాలు ఫిల్ చేయాలి. ఆ తర్వాత దర్శనం, హారతి టైం కి సంబంధించిన స్టాల్నలు ఎంచుకుని, పాస్‌ కోసం బుక్‌ చేసుకోవాలి.