Begin typing your search above and press return to search.

శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన ఆ 84 సెకన్లలో జరగాలట

దగ్గర దగ్గర మరో నెల (ఆ మాటకు వస్తే మూడు రోజులు తక్కువగా) రోజుల్లో దశాబ్దాల తరబడి కోట్లాది మంది ఎదురుచూస్తున్న రోజు రానుంది

By:  Tupaki Desk   |   25 Dec 2023 9:53 AM GMT
శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన ఆ 84 సెకన్లలో జరగాలట
X

దగ్గర దగ్గర మరో నెల (ఆ మాటకు వస్తే మూడు రోజులు తక్కువగా) రోజుల్లో దశాబ్దాల తరబడి కోట్లాది మంది ఎదురుచూస్తున్న రోజు రానుంది. అయోధ్యలో రాములోరి ఆలయాన్ని నిర్మించాలన్న కల సాకారం అవుతోంది. వచ్చే జనవరి 22న శ్రీరాముల వారి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మూడు వారాల ముందే అయోధ్యలో రామాలయ సంరంభం మొదలు కానుంది. ఈ నెల 30న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్యలో ఎయిర్ పోర్టు.. అప్ గ్రేడ్ చేసిన రైల్వేస్టేషన్ ను ప్రారంభించటం తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. అయోధ్యలో రాములోరి విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ జరిపేందుకు అద్భుతమైన ముహుర్తం ఉందని చెబుతున్నారు పండితులు. జనవరి 22న మధ్యాహ్నం 12 గంటల వేళలో 84 సెకన్ల పాటు ఉండే దివ్యమైన ముహుర్తంలోనే రాములోరి విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్న సూచన చేస్తున్నారు. అలా చేస్తే దేశానికి తిరుగు ఉండదంటున్నారు.

జనవరి 22 మధ్యాహ్నం 12.29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30నిమిషాల 32 సెకన్ల మధ్య కాలంలో అత్యంత శుభ గడియలు ఉన్నట్లుగా చెబుతున్నారు వారణాసికి చెందిన సంగ్వేద విద్యాలయ ఆచార్యుడు.. జ్యోతిష్యుడు ఆచార్య గణేశ్వర్ శాస్త్రి. మేష లగ్నంలో అభిజిత్ ముహుర్తంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. అయితే.. ఇప్పటికే నిర్ణయించిన ముహుర్తం ప్రకారం 12. 15 గంటల నుంచి 12.45 గంటల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. అయితే.. దీనికి మరింత స్పష్టతతో కూడిన ముహుర్తాన్ని పండితులు చేస్తున్న సూచన మీద ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి.

ఇదిలా ఉండగా జనవరి 22న అయోధ్యలోని శ్రీరాములోరి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ఆ పట్టణంలోని హోటల్ గదుల రేట్లు భారీగా పెరిగిపోయాయి. కొన్నిచోట్ల ఒక రోజు బసకు రూ.లక్షకు చేరుకోవటం గమనార్హం. వారణాసిలోనూ ఇదే పరిస్థితి ఉందంటున్నారు. ఇదిలా ఉండగా భద్రతా కారణాలతో హోటల్ బుకింగులను అధికారులు రద్దు చేస్తున్నారు. అయోధ్యలో ప్రస్తుతం 30 వరకు హోటళ్లు ఉండగా అందులో మూడు మాత్రమే ఫోర్ స్టార్ హోటళ్లు.. మిగిలనవన్నీ త్రీస్టార్.. టూ స్టార్ హోటళ్లే. ఒక్క ఫైవ్ స్టార్ హోటల్ కూడా లేదు. జనవరి 22న హోటళ్లను బుక్ చేసుకున్న వారి వద్ద ఆహ్వానపత్రం ఉంటే తప్పించి.. మిగిలిన వారికి బుకింగ్ చేసుకోవటానికి అధికారులు నో చెబుతున్నారు.