Begin typing your search above and press return to search.

అయోధ్య రామమందిరంపై మియాందాద్ పైత్యం మాటలు

ఏదో విషయం మీద భారత్ మీద విషం చిమ్మటం పాకిస్థాన్ కు మొదట్నించి ఉన్నదే.

By:  Tupaki Desk   |   18 Nov 2023 4:41 AM GMT
అయోధ్య రామమందిరంపై మియాందాద్ పైత్యం మాటలు
X

ఏదో విషయం మీద భారత్ మీద విషం చిమ్మటం పాకిస్థాన్ కు మొదట్నించి ఉన్నదే. నిజానికి ఆ దేశ ప్రజల కంటే అక్కడి ప్రముఖులకు భారత్ మీద ఉండే ఈర్షా అంతా ఇంతా కాదు. తప్పుడు మాటలు చెబుతూ.. భారత్ మీద తమకున్న ఈర్షను ప్రపంచానికి చాటి చెబుతూ.. వారి మర్యాదను వారే తగ్గించుకోవటం మొదట్నించి చూస్తున్నదే. తాజాగా.. ఆ వరుసలోకి వచ్చారు పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం గురించి ఆయన తనకున్న అక్కసును వెళ్లగక్కుకున్నారు.

ఇప్పటికే ఆలయ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తై.. దాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతన్న వేళ.. అయ్యోధ్య రామమందిరం ప్రతిష్ఠను కించపరిచేలా మాటలు మాట్లాడాడు మియాందాద్. అయితే.. అతగాడి మాటలు విన్నంతనే.. దానికి బదులుగా వచ్చే ప్రశ్నల్ని చూసినప్పుడు.. అతగాడి మాటల్లోని డొల్లతనం ఇట్టే అర్థమైపోతుంది. సోషల్ మీడియాలో అతగాడి మాటల వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇంతకూ.. మియాందాద్ మాటల్ని చూస్తే.. ''అయోధ్య రామమందిర నిర్మాణం ఇస్లాంకు ప్రతీక. అయోధ్య రామ మందిరాన్ని సందర్శించే హిందువులు.. ముస్లింలుగా బయటకు వస్తారు. మన మూలాలతో ముడిపడి ఉన్న ప్రదేశాలను సందర్శించే వారిప మన విశ్వాసం తన వెలుగును ప్రకాశిస్తుందనేది నా ప్రగాఢ విశ్వాసం. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించటం ద్వారా మోడీ తప్పు చేసి ఉండొచ్చు. కానీ.. అది మనకు మంచిదే. ఒక అశీర్వాదంలా పని చేస్తుంది. ముస్లింలు మరోసారి అక్కడే పుంజుకుంటారు. ఈ విషయంలో అల్లాపై నాకు పూర్తి విశ్వాసం ఉంది'' అంటూ తన పైత్యాన్ని ప్రదర్శించారు మియాందాద్.

అతగాడి మాటల్నే ప్రాతిపదికగా తీసుకుంటే.. ఈ నేల మొత్తం హిందు మతానికి చెందింది. మహా అయితే 2000 ఏళ్ల వయసు కూడా లేని ఇస్లాంకు ముందు ఉన్నది హిందుమతమే. మియాందాద్ మాటల్నే ప్రాతిపదికగా తీసుకుంటే.. వేలాది ఏళ్ల నుంచి ఉన్న హైందవం నేల మీద నిర్మించిన ప్రార్థనాలయాలు మొత్తం కూడా హిందుత్వానికే చెందినవి అవుతాయి కదా? అంటే.. అన్య మతస్తులు ఎవరైనా సరే.. వారి ప్రార్థనాలయాలకు వెళ్లి రావటం అంటే.. హిందువులుగా మారటమే అవుతుంది కదా? అంటే ఏ ముఖం పెట్టుకుంటారు.

ఇన్ని మాటలు చెప్పే పెద్ద మనిషి.. తన దేశంలో హిందూ ఆలయాల్ని కూల్చేయటం.. పెద్ద ఎత్తున నాశనం చేయటం లాంటి వాటి గురించి ఏం మాట్లాడతారు. అయినా.. తన దేశం ఎదుర్కొంటున్న పేదరికం.. ఆర్థిక సమస్యలు.. తన దేశ ప్రజల ఆకలిని తీర్చే అంశాల మీద ఫోకస్ చేయాల్సింది పోయి.. ఈ తరహాలో ఆవేశాల్ని.. ఆగ్రహాన్ని పెంపొందించటం ద్వారా సమస్యల మీద ఫోకస్ పక్కకు వెళ్లేలా చేయటం దేనికి నిదర్శనం? అన్నది అసలు ప్రశ్న. ఇప్పటికైనా దేశ ప్రజల బతుకులు మారే అంశాల మీద మియాందాద్ లాంటోళ్లు ఫోకస్ చేస్తే బాగుంటుంది. అంతేకానీ.. మనోభావాల్ని దెబ్బ తీసేలా మాట్లాడి శునకానందాన్ని పొందే తీరును ఎప్పుడు మార్చుకుంటారో ఏమో?