Begin typing your search above and press return to search.

అయ్యన్న తేల్చుకుంటారా...!?

విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ నేతగా టీడీపీకి చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఉన్నారు.

By:  Tupaki Desk   |   15 Jan 2024 4:49 AM GMT
అయ్యన్న తేల్చుకుంటారా...!?
X

విశాఖ జిల్లాలో సీనియర్ మోస్ట్ నేతగా టీడీపీకి చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఉన్నారు. ఆయన టీడీపీలో 1982లో చేరారు. ఎన్టీయార్ పిలిచి మరీ పాతికేళ్ల వయసున్న అయ్యన్నకు టికెట్ ఇచ్చారు. అలా పెళ్ళి కాకుండానే ఎమ్మెల్యే అయి లేత వయసులో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన రికార్డుని అయ్యన్న సొంతం చేసుకున్నారు ఇప్పటికి తొమ్మి సార్లు అసెంబ్లీకి అయ్యన్న పోటీ చేసి ఆరు సార్లు గెలిచారు. సీఎం పదవి తప్ప ఆయన చేపట్టని శాఖ దాదాపుగా లేదనే చెప్పాలి. మధ్యలో ఒకసారి అనకాపల్లి నుంచి ఎంపీగా కూడా అయ్యన్న గెలిచి పార్లమెంట్ కి వెళ్లారు.

వచ్చే ఎన్నికల్లో పదవసారి అయ్యన్న తన సొంత ఇలాకా నర్శీపట్నం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. అయితే అయ్యన్న ఆలోచనలు అన్నీ తన రాజకీయ వారసుడు కుమారుడు విజయ్ మీదనే అని అంటున్నారు అయ్యన్న కూడా తన మనసులో మాట దాచుకోలేదు. తన రాజకీయ వారసుడిగా కుమారుడు విజయ్ ని వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయించాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే టీడీపీ అధినాయకత్వానికి విజయ్ ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేశారు అని అయ్యనే స్వయంగా మీడియాకు చెప్పారు. తన కుమారుడికి ఎంపీ టికెట్ కోసం అయ్యన్న పట్టుదలగా ఉన్నారని ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. నిజానికి చూస్తే 2019 ఎన్నికల్లోనే విజయ్ అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయాలని చూసారు.

అయితే అప్పట్లో అది కుదరలేదు. చంద్రబాబు వేరే వారికి టికెట్ ఇచ్చారు. దాంతో అయిదేళ్ళ పాటు విజయ్ ఆగారు. ఇపుడు చూస్తే మళ్ళీ టికెట్ కోసం ఎదురు చూపులు అవుతున్నాయని అంటున్నారు. పారిశ్రామికవేత్తకు అనకాపల్లి టికెట్ ని ఇవ్వాలని టీడీపీ చూస్తోంది అని ప్రచారం సాగుతోంది.

అయితే అయ్యన్న మాత్రం రెండు టికెట్లు సాధించాలని గట్టిగానే పట్టు పడుతున్నారు. ఏపీలో చాలా మంది సీనియర్ల కుటుంబాలకు రెండేసి మూడేసి టికెట్లను టీడీపీ ఇచ్చింది. ఉత్తరాంధ్రాలోనే చూసుకుంటే పూసపాటి అశోక్ ఫ్యామిలీలో రెండు టికెట్లు 2019లో ఇచ్చారు. కింజరాపు కుటుంబానికి మూడు టికెట్లు ఇచ్చారు.

రాయలసీమలో కేఈ కుటుంబానికి రెండు టికెట్లు, కోట్ల కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చారు. అలాగే భూమా కుటుంబానికి కూడా రెండు టికెట్లు ఇచ్చారు. ఇలా చాలా కుటుంబాలకు రెండేసి టికెట్లు ఇచ్చిన అధినాయకత్వం అయ్యన్న విషహంలో మాత్రం ఎందుకు ఆలోచిస్తోంది అని ఆయన వర్గం అంటోంది. ఈసారి రెండు టికెట్లు అయ్యన్న ఫ్యామిలీకి రావాల్సిందే అంటున్నారు. ఈ విషయంలో తేల్చుకోవాలనే చూస్తున్నారుట. మరి దీని మీద టీడీపీ హై కమాండ్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అన్నది చర్చగా ఉంది మరి.