అయ్యన్న ఆవేశం.. అచ్చెన్న ఆక్రోశం.. మేలు చేస్తాయా?
టీడీపీ సీనియర్ నాయకులు నోరు చేసుకుంటున్నారు. ఆవేశానికి, ఆక్రోశానికి గురవుతున్నారు.
By: Tupaki Desk | 19 Jun 2024 3:51 AM GMTటీడీపీ సీనియర్ నాయకులు నోరు చేసుకుంటున్నారు. ఆవేశానికి, ఆక్రోశానికి గురవుతున్నారు. దీంతో ఎంత మాట అంటే అం తమాట అనేస్తున్నారు. దీంతో పార్టీకి మచ్చలు, మరకలు పడే పరిస్థితి వస్తోంది. గత వైసీపీ సర్కారును ప్రజలు చీదరించుకు నేందుకు, చిత్తు చిత్తుగా ఓడించేందుకు ఈ నోటి దూల తనం కూడా కారణమనే విషయం తెలిసిందే. ఇక,ఇప్పుడు భారీ విజయం దక్కించుకున్న కూటమి నాయకులు కూడా అదే బాట పడితే.. ఎలా? వారిలాగానే నోరు చేసుకుంటే ఎలా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆవేశాన్ని, ఆక్రోశాన్నీ.. కట్టడి చేసుకుని ముందుకు సాగితే.. ప్రజల మన్ననలు మరింతగా చూరగొనే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఏం జరిగింది?
టీడీపీ సీనియర్ నాయకుడు, స్పీకర్ రేసులో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్న నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు.. తాజాగా అధికారులపై నోరు చేసుకున్నారు. మునిసిపల్ అధికారులపై అనలేని మాటలతో ఆయన విరుచుకుపడ్డారు. తాజాగా తన నియోజకవర్గం నర్సీపట్నం నుంచి విజయవాడకు వస్తున్న క్రమంలో ఆయన ఒక చోట కారును ఆపారు. ఈ సయమంలో మునిసిపల్ అధికారులను అక్కడకు పిలిపించారు. రహదారులు, కాల్వలు బాగోలేదంటూ..వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన బూతులు ప్రయోగించారు. ఇవన్నీ వీడియోలుగా మారి.. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఇక, టీడీపీ మరో సీనియర్ నాయకుడు, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా.. నోరు చేసుకున్నారు. తన సొంత నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సమయంలో ఆక్రోశం ప్రదర్శిం చారు. గత వైసీపీ పాలనలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అణిచివేతకు గురయ్యారన్న ఆయన.. ఇప్పుడు మాత్రం కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇక్కడే ఆక్రోశంలో నోరు జారారు.
``టీడీపీ బిళ్ల పెట్టుకుని ఆఫీసులకు వెళ్లండి. అధికారులు మీరు కుర్చీవేసి.. టీ ఇచ్చి.. మీకు పనులు చేస్తారు. అలా చేయకపోతే.. ఆ అధికారులకు ఎలాంటి గతి పడుతుందో వారే చూస్తారు`` అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు కూడా.. మీడియాలో హల్చల్ చేశాయి. దీంతో టీడీపీ నాయకులు కూడా.. ఇలా వ్యవహరిస్తే.. ఎలా అంటూ.. విమర్శలు వస్తుండడం గమనార్హం. పార్టీ అధికారంలోకి వచ్చిందనే భావన ఉన్నా.. గత కాలపు ఆవేదన ఉన్నా.. సీనియర్లు, బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు ఇలా గాడి తప్పి నోరు జారితే ఎలా ? అనేది వాస్తవం. మరి వీరు తమను తాము కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది.