Begin typing your search above and press return to search.

రావాలి జగన్ అంటున్న అయ్యన్న!

మరి ఈ నేపథ్యంలో జగన్ మీదనే అంతా చూపు పెడుతున్నారు ఇదిలా ఉంటే స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా జగన్ అసెంబ్లీకి రావాలని కోరారు.

By:  Tupaki Desk   |   22 Oct 2024 2:58 AM GMT
రావాలి జగన్ అంటున్న అయ్యన్న!
X

ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నవంబర్ మొదటి వారంలో జరుగుతాయని ప్రచారం సాగుతోంది. ఈసారి కనీసంగా వారం నుంచి పది రోజుల పాటు సమావేశాలు జరగవచ్చు అని అంటున్నారు. ఈ సమావేశాలలో పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెడతారు అని తెలుస్తోంది.

అదే విధంగా అమరావతి పోలవరం ప్రాజెక్టులకు సంబంధించి కీలక ప్రకటనలు తీర్మానాలు ఉంటాయి. ఈ బడ్జెట్ సెషన్ ని అత్యంత కీలకంగా టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ బడ్జెట్ సెషన్ కి వైసీపీ హాజరవుతుందా అన్న చర్చ అయితే ఉంది.

ఇప్పటికి శాసనసభ పలు మార్లు సమావేశం అయినా వైసీపీ పెద్దగా హాజరైంది లేదు. మొదటిసారి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగినపుడు జగన్ సభకు వచ్చి ప్రమాణం చేసి వెళ్ళిపోయారు. ఆ తరువాత సభ స్పీకర్ ఎన్నిక కోసం సమావేశమై అయిదు రోజుల పాటు సాగింది.

ఆ సమావేశాలకు వైసీపీ గైర్ హాజరు అయింది. ఇపుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కువ రోజులు సభ జరపనున్నారు. మరి జగన్ వస్తారా అన్నదే అందరి ఆలోచనలలో ఉంది. ఎందుకంటే బడ్జెట్ సెషన్ చాలా కీలకమైనది. అదే సమయంలో గత నాలుగు నెలల కూటమి పాలనలో కొంత మంచి జరిగింది, కొన్ని విమర్శలు ఉన్నాయి.

సహజంగానే విపక్షానికి ఇది ఆయుధంగా ఉంటుంది. దాంతో విపక్షం వస్తే సభలో చర్చలో రచ్చో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ విపక్షం వస్తుందా అన్నదే ఇక్కడ కీలకం. ఇక సంక్షేమ పథకాల విషయంలో హామీలు తప్ప ఏమీ చేయలేదని వైసీపీ విమర్శిస్తోంది.

మరి బడ్జెట్ లో ఏ ఏ పధకాలకు ఎంత నిధులు కేటాయిస్తారు వాటిని ఎప్పటి నుంచి అమలు చేస్తారు అన్నది కూడా ఈ బడ్జెట్ సెషన్ లో చర్చకు ఆస్కారం ఉంది. దానిని లేవనెత్తాల్సింది విపక్షమే. సభలో ఉన్న నాలుగు పార్టీలలో మూడు పార్టీలు కూటమి ప్రభుత్వంలోనే ఉన్నాయి. కాబట్టి విపక్ష పాత్ర నిర్వహిస్తూ ప్రజా గొంతుకను వినిపించాల్సిన బాధ్యత అయితే వైసీపీ మీద ఉంది.

మరి ఈ నేపథ్యంలో జగన్ మీదనే అంతా చూపు పెడుతున్నారు ఇదిలా ఉంటే స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా జగన్ అసెంబ్లీకి రావాలని కోరారు. ఆయన తన సొంత నియోజకవర్గం నర్శీపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్ అసెంబ్లీకి వస్తే బాగుంటుందని అన్నారు. అదే సమయంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

సభకు వస్తే స్పీకర్ హోదాలో తనకు జగన్ నమస్కరించాల్సి ఉంటుందని భావించే రావడం లేదు అని అన్నారు. అయితే విపక్షం సభకు రావాలనే తన ఆలోచన అని ఆయన అన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా అయితే వైసీపీకి ఇచ్చేది లేదని ఇప్పటికే స్పీకర్ స్పష్టం చేశారు. దానికి తగిన సంఖ్యాబలం వైసీపీ తెచ్చుకోలేదు కాబట్టే నిబంధనల ప్రకారమే వెళ్తామని అంటున్నారు. మరి అదే కనుక జరిగితే సాధారణ సభ్యుడిగా సభకు జగన్ హాజరైతే ఆయనకు మైకు ఇస్తారన్న గ్యారంటీ ఏముందని వైసీపీ అంటోంది.

మొత్తానికి చూస్తే జగన్ ని సాధారణ సభ్యుడిగానే చూస్తామని ప్రభుత్వం చెబుతూంటే తమ గొంతు నొక్కే సభకు తాము వెళ్ళి కూడా ఏమిటి లాభం అన్నది విపక్షం వైఖరిగా ఉంది. కీలకమైన బడ్జెట్ సెషన్ కి కూడా వైసీపీ గైర్ హాజరు అయితే మాత్రం ఆ పార్టీ వైఖరి ఏమిటి అన్నది ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు.