మంత్రులపై అయ్యన్న ఆగ్రహం!
అసెంబ్లీకి ఆలస్యంగా వస్తోన్న మంత్రులపై స్పీకర్ అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 16 Nov 2024 5:06 AM GMTఏపీలో కూటమి ప్రభుత్వ కొలువుదీరిన వేళ అసెంబ్లీ స్పీకర్ గా.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు. ఇలా సభాపతిగా ఎన్నికైనప్పటి నుంచీ తన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. హుందాగా ముందుకు వెళ్తూనే... పొరపాట్లు జరిగితే తన పర బేధం లేకుండా కోటింగ్ ఇచ్చేస్తున్నారని అంటున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే అసెంబ్లీ క్యాంటిన్ లో ఎమ్మెల్యేలకు పెట్టే ఫుడ్ పై అయ్యన్న ఇటీవల సీరియస్ గా స్పందించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... "అదేమైనా భోజనమా? మీరు పెట్టిన భోజనం బాగుందని ఒక్క ఎమ్మెల్యే అయినా అన్నారా? అంటూ అసెంబ్లీ అధికారులు, ఫుడ్ కాంట్రాక్టర్ పై స్పీకర్ అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో అసెంబ్లీలోకి ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరులు వస్తున్నారనే విషయంపైనా ఇటీవల స్పందించారు. అనుచరులకు నియంత్రించాలంటూ సున్నితంగా సూచించారు. స్పీకర్ గా ఎన్నికైన కొత్తలో... రెండో గేటుకు అడ్డంగా కట్టిన గోడను కూల్చి వేస్తూ దాన్ని పునరుద్ధరించారు. ఈ క్రమంలో తాజాగా మంత్రులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవును... అసెంబ్లీకి ఆలస్యంగా వస్తోన్న మంత్రులపై స్పీకర్ అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా... ప్రశ్నోత్తరాల సమయాన్ని మంత్రులు సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా... "మంత్రులే సభకు ఆలస్యంగా వస్తే ఎలా?" అని ప్రశ్నిస్తూ.. "సరైన సమయానికి రావడానికి ప్రయత్నించండి" అంటూ సూచించారు.
తణుకు ఈ.ఎస్.ఐ. ఆసుపత్రిపై అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చే సమయంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ అందుబాటులో లేకపోవడంతో స్పీకర్ ఈ విధంగా స్పందించారు.