మాజీ సీఎం జగన్ పై స్పీకర్ షాకింగ్ కామెంట్స్.. క్షమించి వదిలేస్తున్నారట..
అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరుతున్న వైసీపీ శాసనసభా పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు షాకింగ్ కామెంట్స్ చేశారు
By: Tupaki Desk | 5 March 2025 10:55 AM ISTఅసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరుతున్న వైసీపీ శాసనసభా పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. తనపై అభియోగాలు, ప్రేలాపణలు, ఆరోపణలు చేస్తున్నజగన్ ను సభాపతి హోదాలో క్షహించి వదిలేస్తున్నట్లు చెప్పారు. 16వ శాసనసభలో ఎమ్మెల్యే అయిన జగన్ తనకు గత ఏడాది జూన్ 24న ప్రతిపక్ష హోదా కోసం లేఖ రాశారని చెప్పారు. ఆ లేఖను అసెంబ్లీలో చదవి వినిపించిన స్పీకర్ వైసీపీ ప్రతిపక్ష హోదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీకి ప్రతపక్ష హోదా ఇచ్చే విషయమై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తన వైఖరి స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా ఇద్దామని భావించినా, తనపై లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై వైసీపీ కోర్టును ఆశ్రయించిందని, తనను, శాసనసభా వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేయాలని కోరిందని సభకు తెలిపారు. అయితే అడ్వొకేట్ జనరల్ కోరిన మీదట కోర్టు తమను ప్రతివాదులుగా చేర్చలేదని చెప్పారు. ఇక కోర్టులో హోదాపై పిటిషన్ పెండింగులో ఉన్నందున తాను ఏ నిర్ణయం తీసుకోవడం లేదని సభకు నివేదించారు.
‘‘ప్రతిపక్ష హోదాపై జగన్ హైకోర్టుకు వెళ్లారు. న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చేవరకు వేచిచూద్దామనుకున్నా, ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన కామెంట్లు నాకు తెలిశాయి. ఎంతటి వారిపైనైనా అసత్యాలు ప్రచారం చేసే ధోరణిలో జగన్ వ్యవహరిస్తున్నారు. వారు చేస్తున్న ఆరోపణలు గందరగోళానికి దారి తీస్తున్నాయి. స్పీకర్ దురద్దేశాలు అపాదించడం సభా నియమాల ఉల్లంఘన కిందకి వస్తాయి. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి ఆశించడం తప్పు’’ అని అయ్యన్న వ్యాఖ్యానించారు.
‘‘ప్రతిపక్ష హోదాకు సరైన సంఖ్యా బలం ఉండాలని చట్టం చెబుతోంది. 175 మంది సభ్యులు ఉన్న శాసనసభలో కనీసం 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా లభించదు. అంటే కనీసం 10 శాతం సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందనే నిబంధనను గతంలో జగనే ప్రస్తావించారు. ఇవన్నీ తెలిసి జగన్ చేసిన ప్రేలాపనలను సభాపతి హోదాలో క్షమించి వదిలేస్తున్నా. అభియోగాలు, ప్రేలాపనలు, బెదిరింపులతో జగన్ నాకు గత ఏడాది జూన్ 24న లేఖ రాశారు. మరోవైపు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను విచారించాలా? వద్దా? అనేది ఇంకా కోర్టు పరిశీలనలో ఉంది. అయినా ప్రతిపక్ష హోదాపై ఆయన అసత్యాలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. తప్పుడు ప్రచారానికి తెరదించేందుకు రూలింగ్ ఇవ్వాలని నిర్ణయించా, సభకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలు ప్రజలు తమను ఎందుకు గెలిపించారో ఆలోచించాలి’’ అని స్పీకర్ సూచించారు.