స్పీకర్ అయ్యన్న తెలుగుతనం
ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలుగులో ప్రసంగించి తెలుగుతనాన్ని తెలుగు ధనాన్ని దేశానికి చాటారు.
By: Tupaki Desk | 21 Jan 2025 3:31 AM GMTఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలుగులో ప్రసంగించి తెలుగుతనాన్ని తెలుగు ధనాన్ని దేశానికి చాటారు. బీహార్ రాజధాని పాట్నాలో 85అ సభాపతుల మహా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తో పాటుగా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి స్పీకర్లు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో అయ్యన్నపాత్రుడు తెలుగులో ప్రసంగించడం విశేషం. ఆయన తెలుగు భాషలో మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.
ఆయన తెలుగులోనే రాజ్యాంగం గురించి దాని గొప్పతనం గురించి వివరించారు. శాసనసభల పనితీరు గురించి గురించి కూడా ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. శాసనసభల పని గంటలు పెరగాలని అర్ధవంతమైన చర్చలు సాగాలని ఆయన కోరారు.
ఏపీ అసెంబ్లీలో ఈసారి పెద్ద ఎత్తున కొత్త సభ్యులు వచ్చారని ఆయన తెలియచేశారు. సభా కార్యక్రమాలను ప్రొసీడింగ్స్ ని సభ్యులు తెలుసుకోవాలని దానిని అనుగుణంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఎక్కువ పని దినాలు ఉండాలని ప్రజా సమస్యలు కూడా ఎక్కువగా చర్చకు నోచుకోవాలని ఒక సీనియర్ ప్రజా ప్రతినిధిగా అయ్యన్న సూచనలు చేశారు. ఇదిలా ఉండగా అయ్యన్న సరళమైన తెలుగులో తన ప్రసంగం మొత్తం చేయడం మాత్రం ఆసక్తిని గొలిపింది. ఆయన ఈ విధంగా చేయడం ద్వారా తెలుగు గొప్పదనాన్ని చాటారని అంటున్నారు.
ఇక చూస్తే అయ్యన్న సామాన్య నాయకుడిగానే ఎక్కడైనా వ్యవహరిస్తారు అని అంటారు. ఆయన మాట తీరు ఆయన వ్యవహార శైలి కూడా అలాగే ఉంటుందని చెబుతారు. ఆయన ఈ రోజు రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నా కూడా తన మాతృ భాషలో ప్రసంగించడానికి ఏ మాత్రం సంకోచించలేదని సందేహించలేదని అంతా కొనియాడుతున్నారు. మొత్తానికి దటీజ్ అయ్యన్న అనిపించారు అని అంటున్నారు.