మంత్రి పదవి రానందుకు అయ్యన్న సంచలన వ్యాఖ్యలు !
ఏపీలో కొత్త మంత్రులకు తాను మద్దతు ఇస్తాను అని ఆయన చెప్పారు. వారికి పదవులు రావడం పట్ల మనస్పూర్తిగా తాను సంతోషిస్తాను అని అయ్యన్న అన్నారు.
By: Tupaki Desk | 13 Jun 2024 5:03 PM GMTతనకు మంత్రి పదవి రాలేదన్న దాని మీద సీనియర్ నేత, టీడీపీకి చెందిన మాజీ అయ్యన్నపాత్రుడు సంచలన కామెంట్స్ చేశారు. మాకు మంత్రి పదవి రాకపోతే ఎందుకు అసంతృప్తి ఉంటుందని ఆయన ప్రశ్నించడం విశేషం. నా వరకు అయితే పాతికేళ్ళకే మంత్రిని అయ్యాను అని అయ్యన్న గుర్తు చేసుకున్నారు. ఆనాడు సీనియర్లు అలిగారా అని ఆయన ప్రశ్నించారు.
పాతవారే కొనసాగితే కొత్త వారికి అవకాశాలు ఎలా వస్తాయని ఆయన అంటున్నారు. ఏపీలో కొత్త మంత్రులకు తాను మద్దతు ఇస్తాను అని ఆయన చెప్పారు. వారికి పదవులు రావడం పట్ల మనస్పూర్తిగా తాను సంతోషిస్తాను అని అయ్యన్న అన్నారు.
పార్టీలో జూనియర్లు ఎదగాలనే తామంతా కోరుకుంటామని అయ్యన్న చెప్పడం విశేషం. కొత్తవారికి పదవులు ఇస్తే ఏ ఒక్క సీనియర్ నేత బాధపడరని ఆయన అన్నారు పైగా పెద్ద వారిగా తాము ఆనందిస్తామని మంచి మాటలే చెప్పారు.
మరోవైపు ఎన్డీయే కూటమి విజయం వెనక చంద్రబాబు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ముగ్గురూ ఉన్నారని అయ్యన్న విశ్లేషించారు.అంతే తప్ప ఇది ఏ ఒక్కరి విజయం కిందనో చెప్పడం తగదని అన్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరో ఒకరు కాదని అందరూ అని అయ్యన్న అన్నారు.
తనకు తెలుగుదేశం పార్టీ రాజకీయ జీవితాన్ని ఇచ్చిందని ఆ పార్టీని తాను ఎంతో రుణపడి ఉంటాను అని అయ్యన్న అన్నారు. పార్టీ కోసం ప్రాణం అయినా అర్పిస్తాను అని ఆయన అన్నారు. ఇదిలా ఉంతే వైసీపీ హయాంలో చాలా మంది అధికారులు ముఖ్యంగా పోలీసు శాఖలో కొందరు అధికారులు మితిమీరి ప్రవర్తించారని వారి జాబితా తన వద్ద ఉందని అయ్యన్న అన్నారు.
అలాంటి వారి విషయంలో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన చంద్రబాబుని కోరారు. తాను మాత్రం వారిని క్షమించను అని ఆయన ఖరాకండీగా చెప్పేశారు. టీడీపీ మంచి అధికారులను ప్రోత్సహిస్తుందని దాడులను ఎక్కడ జరగనీయకుండా చూస్తుందని ఆయన అన్నారు తమ పార్టీ వారి మీదనే గతంలో దాడులు జరిగాయని చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు.
ఇవన్నీ పక్కన పెడితే సీనియర్లకు బాబు మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదని దాని వల్ల వారు అంతా గుస్సా అయ్యారని వస్తున్న వార్తలకు అయ్యన్న చెక్ పెట్టేశారు. టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన అయ్యన్న వంటి వారే ఇలా ప్రకటిస్తే మిగిలిన సీనియర్లు కూడా ఇదే బాటన నడవక తప్పదని అంటున్నారు. టీడీపీకి బాబు కుటుంబానికి వీర విధేయుడు అయిన అయ్యన్న ఈ విధంగా ప్రకటించడం ద్వారా బాబు చేసిన మంత్రివర్గం కూర్పు శభాష్ అనిపించేశారు అని అంటున్నారు. మరి మిగిలిన సీనియర్లు కూడా ఇపుడు పెదవి విప్పాల్సిన పరిస్థితి ఉంటుందేమో.