సిరా చుక్కతో పోల్చుతూ స్పీకర్ అయ్యన్న హాట్ కామెంట్స్ !
స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఇపుడిపుడే కుదురుకుంటున్నారు. నిజానికి ఆయన పొలిటికల్ స్టైల్ భిన్నంగా ఉంటుంది
By: Tupaki Desk | 2 Aug 2024 4:06 AM GMTస్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఇపుడిపుడే కుదురుకుంటున్నారు. నిజానికి ఆయన పొలిటికల్ స్టైల్ భిన్నంగా ఉంటుంది. ఆయన మాటల్లో దూకుడు కనిపిస్తుంది. ఆయన మీడియా ముందుకు వచ్చారూ అంటే సెటైర్లు పేలాల్సిందే. అవి ప్రత్యర్ధులను మింగుడుపడని బాంబులుగా మారేవి.
అయితే స్పీకర్ గా అయ్యన్న నెగ్గిన తరువాత చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడింది ఏంటంటే అయ్యన్న తీరు ఇక మీదట మార్చుకోవాలని. సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు లాంటి వారు అయితే పాత అవతారం చాలించి కొత్త అవతారానికి షిఫ్ట్ అవమని ఒక సూచన లాంటి సెటైర్ వేశారు.
ఇవన్నీ గమనంలోకి తీసుకున్న అయ్యన్న నెమ్మదిగా హుందాగా మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఆయన తాజాగా గోదావరి జిల్లా పర్యటనలో ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ మీడియా నుంచి ఆయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేయడం మీదనే మీడియా అడిగింది.
మామూలుగా అయ్యన్న అయితే దానికి ధీటైన జవాబు చెప్పేవారు. రాజకీయంగా మసాలా కూడా కలిపి కొట్టేవారు. కానీ ఆయన స్పీకర్ గా ఉన్నారు. దాంతో ఆయన కాస్తా చమత్కారంగానే మాట్లాడారు. ఓటేసిన వేలికి ఇంకా సిరా చుక్కే చెరిగిపోలేదు. ఇంతలోనే అభివృద్ధి చేయాలంటే ఎలా అబ్బా అంటూ మీడియాను తిరిగి ప్రశ్నించారు.
రాష్ట్రం ఇబ్బందులో ఉంది. అయినా ప్రభుత్వం ఒక వైపు సంక్షేమం మరో వైపు అభివృద్ధిని చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. కాస్తా టైం పడుతుంది, అయినా పాలన బాగానే సాగుతుందని అన్నారు. ఈ విధంగా అయ్యన్న సిరా చుక్కతో పోలుస్తూ సెటర్లు పేల్చడంతో అదిప్పుడు వైరల్ అవుతోంది.
ఒక విధంగా వైసీపీ వారికే ఇండైరెక్ట్ గా స్పీకర్ వేసిన సెటైర్లు వేశారు అని అంటున్నారు. ఇక ఇదే ప్రెస్ మీట్ లో అయ్యన్నకు జగన్ గురించి కూడా ప్రశ్నలు వచ్చాయి. విపక్ష నేత హోదా జగన్ కోరుకుంటున్నారని దానికి ఏమంటారు అంటే చట్టం ఉంది దాని ప్రకారమే తాము వెళ్తామని అయ్యన్న బదులిచ్చారు. అంటే సంప్రదాయం ప్రకారం చట్ట ప్రకారం అన్నీ చూస్తామని చెప్పినట్లే అంటున్నారు.
ఆ విధంగా ఆయన విపక్ష హోదా జగన్ కి ఇస్తారా లేదా అన్న దానికి రాజ్యాంగం ప్రకారమే అంతా అని బదులిచ్చేశారు. తాను కొత్త సభ్యులకు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇస్తానని రాజకీయాలకు అతీతంగా అందరికీ అన్ని పార్టీలకు మాట్లాడేందుకు వీలు కల్పించేలా సభను నడుపుతాను అన్నారు.
మంత్రిగా పనిచేసిన తనకు స్పీకర్ గా పనిచేయడం కొత్త బాధ్యత అని అయ్యన్న అంటున్నారు. ఇది రాజ్యాంగబద్ధమైన పదవి అని అందుకే తాను రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదువుతున్నాను అని మీడియాకు బదులిచ్చారు. మొత్తానికి స్పీకర్ గా అయ్యన్న స్పీచ్ మాత్రం భిన్నంగానే సాగుతోందని చెప్పాలి.