Begin typing your search above and press return to search.

అజారుద్దీన్‌ అఫిడవిట్‌ లో వివాదాస్పద అంశాలు ఇవే

కాగా నామినేషన్లు వేసే ప్రక్రియ నవంబర్‌ 10న ముగిసింది. నవంబర్‌ 30న ఒకే విడతలో 119 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

By:  Tupaki Desk   |   11 Nov 2023 3:44 AM GMT
అజారుద్దీన్‌ అఫిడవిట్‌ లో వివాదాస్పద అంశాలు ఇవే
X

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. మరోసారి గెలవడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్, ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్న «ధీమాతో కాంగ్రెస్‌ పార్టీ దూసుకుపోతున్నాయి. ఇక బీజేపీ, బీఎస్పీ తదితర పార్టీలు సైతం ఎన్నికల గోదాలో ఉన్నాయి.

కాగా నామినేషన్లు వేసే ప్రక్రియ నవంబర్‌ 10న ముగిసింది. నవంబర్‌ 30న ఒకే విడతలో 119 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 3న ఫలితాలను ప్రకటిస్తారు.

కాగా హైదరాబాద్‌ నగర పరిధిలో ఉన్న జూబ్లీహిల్స్‌ నుంచి భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్, మాజీ ఎంపీ మహ్మద్‌ అజారుద్దీన్‌ పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. దివంగత నేత పీజేఆర్‌ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌ రెడ్డిని పక్కనపెట్టి మరీ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం అజారుద్దీన్‌ కు సీటు కేటాయించింది.

ఈ నేపథ్యంలో అజారుద్దీన్‌ తన నామినేషన్‌ ను దాఖలు చేశారు.

తనకు, తన భార్యకు రూ.18.95 కోట్ల ఆస్తులున్నట్లు ఎన్నికల అఫిడవిట్‌ లో ఆయన ప్రకటించారు. ఈ ఆస్తుల్లో రూ.10.42 కోట్లు తన పేరు మీద, మిగిలినవి తన భార్య పేరు మీద ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

కాగా అజారుద్దీన్‌ చేతిలో రూ.1,94,300 నగదు ఉందని తెలిపారు. రూ.72 లక్షల విలువైన లాండ్‌ రోవర్‌ కారు, రూ.28 లక్షల విలువైన హోండా సీఆర్‌వీ కారు ఉందని పేర్కొన్నారు. ముంబయి, హైదరాబాద్, పుణెలో స్థిరాస్తులున్నట్లు పేర్కొన్న ఆయన రూ.2.07 కోట్ల అప్పులున్నాయని వెల్లడించారు.

కాగా తనపై మొత్తం 9 కేసులు ఉన్నాయని కూడా అజారుద్దీన్‌ ఎన్నికల అఫిడవిట్‌ లో ప్రకటించారు. వీటిలో 5 చీటింగ్‌ కేసులు ఉన్నాయి. మరో రెండు కేసులు చెక్‌ బౌన్స్‌ లకు సంబంధించినవి. మరో రెండు కేసులు శారీరక వేధింపుల కేసులు కావడం గమనార్హం.

హైదరాబాద్‌ నగరంతో పాటు ముంబై, ఢిల్లీలో కూడా కేసులు ఉన్నట్టు అజారుద్దీన్‌ తన ఎన్నికల అఫిడవిట్‌ లో పేర్కొన్నారు. నగరంలోని ఉప్పల్, బేగంపేట పోలీస్‌ స్టేషన్లలో 7 కేసులు ఉన్నాయని తెలిపారు.

ఉప్పల్‌ పీఎస్‌లో ఐపీసీ 406, 409, 420, 465, 467, 471, 120 బీ సెక్షన్ల కింద మూడు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. బేగంపేట పీఎస్‌లో కూడా పలు కేసులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు.

కాగా ఉత్తరప్రదేశ్‌ లోని మొరాదాబాద్‌ నుంచి 2009లో కాంగ్రెస్‌ తరఫున అజారుద్దీన్‌ ఎంపీగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఆయన రాజస్థాన్‌ కు మారారు. ఆ రాష్ట్రంలోని టోంక్‌–సవాయ్‌ మాధోపూర్‌ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు అజారుద్దీన్‌ తీవ్ర వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయనపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా గతంలో భారత క్రికెట్‌ లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో ఆయన జట్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో అజారుద్దీన్‌ విజయం సాధించడానికి ఎలాంటి వ్యూహాలు పన్నుతారో వేచిచూడాల్సిందే.