రాహుల్ గాంధీని కలవాలా.. అయితే 10 కిలోలు తగ్గాల్సిందే!
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 23 Feb 2024 7:19 AM GMTకాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. మణిపూర్ నుంచి గుజరాత్ వరకు రాహుల్ యాత్ర సాగనుంది. ప్రస్తుతం రాహుల్ పర్యటన మహారాష్ట్రలో కొనసాగుతోంది.
కాగా రాహుల్ గాంధీ మహారాష్ట్రలో ఎంటర్ అయ్యారో లేదో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ అశోక్ చవాన్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మరో కీలక నేత మిలింద్ దేవ్ రా సైతం ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరారు. అశోక్ చవాన్ కు బీజేపీ రాజ్యసభ సీటును ఆఫర్ చేసింది. కొద్ది రోజుల క్రితం ఆయన బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న బాబా సిద్ధిఖీ సైతం ఆ పార్టీకి రాజీనామా చేసి అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
కాగా మహారాష్ట్ర నేత బాబా సిద్ధిఖీ కుమారుడు జీషాన్ సిద్ధిఖీ ముంబై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇటీవల ఆయన తండ్రి బాబా సిద్ధిఖీ ఎన్సీపీలో చేరిపోవడంతో జీషాన్ సిద్ధిఖీని పదవి నుంచి తప్పించారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై జీషాన్ సిద్ధిఖీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహల్ ను కలవడానికి వెళ్లిన తనకు వింత అనుభవం ఎదురైందని చెప్పారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర మహారాష్ట్రలోని నాందేడ్ కు వచ్చినప్పుడు.. రాహుల్ గాంధీని కలవాలనుకున్నానని జీషాన్ సిద్ధిఖీ తెలిపారు. అయితే, రాహుల్ ను కలవాలంటే తాను పది కిలోలు తగ్గాలంటూ ఆయన సన్నిహితులు తనకు సూచించారని జీషాన్ విమర్శించారు. కాంగ్రెస్ లో మైనార్టీ నాయకులు, కార్యకర్తలతో వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.
తనను ముంబై యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా తొలగించినా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని జీషాన్ సిద్ధిఖీ మండిపడ్డారు. ఈ చర్యల విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో జీషాన్ సిద్ధిఖీ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.