బీసీలే వెన్నెముక.. మరోసారి వారికే పెద్దపీట!
ఇంత పెద్ద మొత్తంలో నిధులను ఇటీవల ఏ బడ్జెట్‌లోనూ ప్రవేశ పెట్టకపోవడం గమనార్హం.
By: Tupaki Desk | 28 Feb 2025 12:26 PM ISTబీసీలే టీడీపీకి వెన్నెముక అంటూ.. పదే పదే చెప్పే ఏపీసీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. తాజా బడ్జెట్‌లో బీసీలకు భారీ మొత్తం కేటాయించారు. ఇతర ఏ పథకాలకు, కార్యక్రమాలకు, ప్రాజెక్టులకు కూడా కేటాయించని విధంగా బీసీల సంక్షేమానికి ఏకంగా 47,456 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులను ఇటీవల ఏ బడ్జెట్‌లోనూ ప్రవేశ పెట్టకపోవడం గమనార్హం. తద్వారా.. బీసీల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.
ఇక, రాష్ట్ర వ్యవసాయానికి రూ.48వేల కోట్లు కేటాయించారు. పైగా.. అధునాతన వ్యవసాయ రీతులకు మెజారిటీ నిధులు ఖర్చుచేయనున్నట్టు పేర్కొన్నారు. సంప్రదాయ వ్యవసాయ స్థానంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించనున్నారు. దీంతో రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గి.. వారు రుణాల నుంచి విముక్తులవుతారని.. ప్రభుత్వం భావిస్తోంది. అదేసమయంలో వ్యవసాయంలోనూ మెళకువులను నేర్పించే నైపుణ్యాభివృద్ధికి కూడా ఈనిధులను వెచ్చించనున్నారు. విత్తనాలు, పురుగు మందులకు ప్రాధాన్యం ఇస్తారు.
రాష్ట్రానికి వచ్చే ఆదాయం(రెవెన్యూ) రూ.2,51,162 కోట్లు కాగా.. దీని నుంచి వివిధ ప్రాజెక్టులకు(మూలధన వ్యయం) రూ.40,635 కోట్లు ఖర్చు చేయనున్నారు. అయితే.. వాస్తవంగా రావాల్సిన రెవెన్యూతో పోల్చుకుంటే.. ఇది రూ.33,185 కోట్లు తక్కువగా ఉంది. అదేసమయంలో ద్రవ్య లోటు(ప్రభుత్వం చేసే ఖర్చు) రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు. అంటే.. ఈ మొత్తాన్ని అప్పుల రూపంలో సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అది ఈ ఏడాదికే పరిమితం. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో 80 వేల కోట్ల రూపాయలను అప్పుగా తెచ్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.