వరద బాధితులకు పరిహారం ఇదే.. సర్కారు నిర్ణయం
దీంతో ఇక్కడి సుమారు 2.5 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
By: Tupaki Desk | 11 Sep 2024 11:50 AM GMTఏపీలో వరద సంభవించి తీవ్రంగా నష్టపోయిన వారికి, అదేవిధంగా పాక్షికంగా నష్టపోయిన వారికి ఉపశ మనం కల్పిస్తూ.. చంద్రబాబు ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. విజయవాడలోని సింగునగర్, ప్రకాశ్‌నగర్, రాధానగర్, శాంతి, ప్రశాంతి నగర్‌లు, ఎల్బీ నగర్, కండ్రిక, నున్న రింగ్ రోడ్డుల పరిధిలో బుడమేరు కారణంగా వరద వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయా ప్రాంతాల్లోని ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి.
దీంతో ఇక్కడి సుమారు 2.5 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద కారణంగా ఎనిమిది రోజు లుగా ఆరు నీటిలోనే నానారు. వీరికి ఆహారం, నీళ్లు అందించిన సర్కారు .. గత రెండు రోజులుగా 25 కిలోల బియ్యం, ఆయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, ఆలూ వంటివి కూడా సరఫరా చేస్తోంది. ఇక, ఈ వరదల కారణంగా నష్టపోయిన వారికి.. తాజాగా పరిహారం ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న నష్ట అంచనా(ఎన్యూమరేషన్) ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగియనంది. దీంతో ఈ పరిహారాన్ని బాధితుల ఖాతాల్లో వేయనున్నారు.
వరద ప్రభావంతో బాగా నీట మునిగిన ఇళ్లకు రూ.25 వేలు, పాక్షికంగా మునిగి దెబ్బతిన్న ఇళ్లకు రూ.10 వేల చొప్పున సాయం అందించనుంది. అదేవిధంగా వరదల్లో నీటమునిగిన మోటర్ సైకిళ్ల మరమ్మతుకు రూ.3 వేలు, ఆటోలకు, ట్యాక్సీలకు రూ.10వేలు చొప్పున సాయం అందించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే.. దీనిపై సీఎం చంద్రబాబు ప్రకటన చేయాల్సి ఉంది.
మరోవైపు.. వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ వరద బాధితులకు రూ.25 కోట్లను సర్కారు తాజాగా విడుదల చేసింది. అదేవిధంగా విజయనగరంలో వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం రూ.2 కోట్లను విడుదల చేసిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.