Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్...గుండెల్లో దడ దడ !

ఏడున్నర పదుల వయసుల ఉన్న బాబు ఇంతలా కష్టపడుతూంటే ఆయన టీం అలాగే ఉందా అన్నది చర్చగా నడుస్తోంది.

By:  Tupaki Desk   |   17 Sep 2024 3:00 AM GMT
టీడీపీ ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్...గుండెల్లో దడ దడ !
X

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి కొద్ది రోజులలో వంద రోజులు పూర్తి చేసుకుంటుంది. అదే సమయంలో ప్రభుత్వం మీద ప్రజాభిప్రాయం ఎలా ఉంది అన్నది కూడా చర్చకు వస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు మంచి మార్కులే పడుతున్నాయి. ఇటీవల బెజవాడ వరదలు సంభవిస్తే ఏకంగా పది రోజుల పాటు బాబు అక్కడే ఉండి తీసుకున్న చర్యలు రెస్క్యూ ఆపరేషన్ మీద కూడా జనాలు అంతా బాబు ఈజ్ గ్రేట్ అంటున్నారు.

ఏడున్నర పదుల వయసుల ఉన్న బాబు ఇంతలా కష్టపడుతూంటే ఆయన టీం అలాగే ఉందా అన్నది చర్చగా నడుస్తోంది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న వారి విషయంలో బాబు వంద రోజుల పనితీరు మీద ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు తన సొంత పార్టీ నెట్ వర్క్ ద్వారా కూడా బాబు సర్వేలు చేయించి నివేదికలు తీసుకున్నారు అని అంటున్నారు.

బాబు అనుకున్న తీరులో పలువురు ఎమ్మెల్యేలు పనితీరుని ప్రదర్శించకపోతున్నారు అని అంటున్నారు. చాలా మంది గ్రౌండ్ లెవెల్ లో తమ సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని కొందరు మహిళా ఎమ్మెల్యేల విషయంలో అయితే కుటుంబ సభ్యుల ప్రమేయం పెరిగిపోతోందని ఉచిత ఇసుక విషయంలో కూడా కొందరి హ్యాండ్ ఉందని అంటున్నారు.

అదే విధంగా ప్రజలకు చేరువ కాకపోవడం, పార్టీ ఇచ్చిన పిలుపుని పట్టించుకోకపోవడం వంటివి కూడా కొందరి విషయంలో జరుగుతోంది అని అంటున్నారు. ఇటీవల భారీ వానలు వరదలు ఏపీని ముంచేస్తే ఎంతమంది ఎమ్మెల్యేలు అలెర్ట్ అయి గ్రౌండ్ లెవెల్ లో బాగా పనిచేశారు అన్న డేటాను కూడా పార్టీ రెడీ చేస్తోంది అని అంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలలో ప్రచారం చేయడం, దానికి అనుగుణంగా పనిచేయడం వంటివి ఎంత మంది చేస్తున్నారు అన్నది కూడా చూస్తున్నారు.

అలాగే దందాలు అవినీతి ఆరోపణలు ఎవరి మీద వస్తున్నాయన్నది కూడా పార్టీ నిశితంగా పరిశీలన చేస్తోంది అని అంటున్నారు. ఇలా బాబు వద్ద చాలా మంది సొంత పార్టీ ఎమ్మెల్యేల జాతకం పదిలంగా ఉంది అని అంటున్నారు దాంతో వారి విషయంలో అన్ని మధింపు చేస్తున్నారు అని అంటున్నారు.

వంద రోజుల పనితీరు మీద సమగ్రంగమైన నివేదికనే బాబు సిద్ధం చేస్తున్నారు అని అంటున్నారు. ఒక వైపు తన కేబినెట్ లో ఉన్న ఇరవై నాలుగు మంది మంత్రుల జాబితాను కూడా బాబు ముందేసుకుని వారి పనితీరుని మధింపు చేస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పట్టుదలగా పనిచేస్తోందని రాష్ట్రాన్ని ఒక గాడిన పెట్టేందుకు చూస్తోందని అయితే ఆ స్పూర్తిని కొంతమంది సీరియస్ గా తీసుకోవడం లేదన్న అసంతృప్తి అయితే టీడీపీ అధినాయకత్వం లో ఉంది.

మరి వంద రోజుల ప్రభుత్వ పాలన సందర్భంగా బాబు ప్రోగ్రెస్ రిపోర్టులు ఆయా ఎమ్మెల్యేలకు ఇచ్చి వారికి తగిన సూచనలతో వదిలేస్తారా లేక హెచ్చరికలు జారీ చేస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది. పదవి అంటే బాధ్యత అన్నది బాబు ఆలోచన. కానీ పదవిని వేరే విధంగా వాడుకుంటే మాత్రం అధినాయకత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు అని అంటున్నారు.

ఏపీలో ప్రభుత్వం ఇపుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య పనిచేస్తోందని, మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే విభజన నాటి నుంచి ఏర్పడిన సంక్షోభాలతో సవాళ్ళతో రాష్ట్రం సాగుతోందని అంటున్నారు. దానిని అధిగమించాలీ అంటే ప్రతీ ఒక్కరూ తన వంతుగా పట్టుదలగా పనిచేయాలని టీడీపీ అధినాయకత్వం ఆలోచనగా ఉంది అని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యేలు తమ పరిధిలో సమర్ధంగా పనిచేస్తేనే పార్టీకి ప్రభుత్వానికి పేరు వస్తుందని అంటున్నారు.