Begin typing your search above and press return to search.

రాజకీయం చేయడం నామోషీ...బాబు మాటలకు అర్ధం ?

ఈ టెర్మ్ పూర్తి అయితే రెండు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనమైన రికార్డు తెలుగు నాట ఆయన సొంతం అవుతుంది.

By:  Tupaki Desk   |   12 Sep 2024 1:33 PM GMT
రాజకీయం చేయడం నామోషీ...బాబు మాటలకు అర్ధం ?
X

రాజకీయం అంటే చంద్రబాబుకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఆయనది సుదీర్ఘమైన రాజకీయ జీవితం. చంద్రబాబు విద్యార్ధి దశ నుంచి మొదలెట్టి ఈ రోజు వరకూ రాజకీయాల్లో ఉన్నారు. అంటే ఏకంగా యాభై ఏళ్ళు పూర్తి చేసినట్లే. చంద్రబాబు రాజకీయ జీవితంలో అరుదైన రికార్డులు ఉన్నాయి. తెలుగు నాట ఎవరికీ లేని విధంగా నాలుగు సార్లు సీఎం గా ఆయనే పనిచేశారు. ఈ టెర్మ్ పూర్తి అయితే రెండు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనమైన రికార్డు తెలుగు నాట ఆయన సొంతం అవుతుంది.

అలా బాబు దరిదాపుల్లోకి సమీప భవిష్యత్తులో సైతం ఎవరూ వచ్చే అవకాశం లేదు అనే చెప్పాలి. ఇక అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబు ప్రజలలోనే ఉంటారు. గట్టిగా చెప్పాలంటే ఆయన గత ఏడాది జైలులో ఉన్న 50 రోజుల కాలం మాత్రమే ఆయన విశ్రాంతి గా ఉన్నది.

అంతటి కార్యదీక్షా పరుడు రాజకీయాలు ప్రజా జీవితం పట్ల అత్యంత మక్కువ కనబరచే బాబు నోటి వెంట ఈ రాజకీయాలు ఏంటో అన్న వైరాగ్యం అలాగే నామోషీ అన్న మాటలు రావడం నిజంగా ఆశ్చర్యమే. ఏలూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతలలో చంద్రబాబు పర్యటించిన సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ ఆసక్తిని రేకెత్తించే వ్యాఖ్యలే చేశారు.

రాజకీయాలు ఈ రోజుల్లో చేయడం నాకు అయితే నామోషీగా ఉంది. ఈ రాజకీయాలు అవసరమా అన్న ఆవేదన కూడా ఉంది అని బాబు అన్నారు. రాజకీయ ప్రత్యర్ధులు తీరు మరీ దిగజారుడుగా ఉందని ఆయన వైసీపీ అధినేత జగన్ మీద పరోక్ష వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ముసుగులో నేరస్తులు వస్తున్నారని వారిని ఎదుర్కోవడం రాజకీయాలను చేయడం అంటే నామోషీగానే ఉంది అని ఆయన అన్నారు.

ఆయన మాటలలో అర్ధాలు ఏంటి అంటే జగన్ నేరస్తుడు అని ఆయన పార్టీ ఏపీలో భ్రష్టు పట్టించే రాజకీయం చేస్తోంది అని. ఆ విధంగా జగన్ మీద వైసీపీ మీద బాబు విమర్శలు చేస్తూ ఈ రోజుల్లో తనలాంటి వారికి రాజకీయాలు చేయడం అంటే నామోషీయే అని చెప్పారన్న మాట.

అయితే బాబు అర్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే కాలం మారింది. అన్ని రంగాలలో కొత్త మార్పులు వస్తున్నాయి. బాబు రాజకీయం మొదలెట్టే టైంలో చాలా మంది రాజకీయ దిగ్గజాలు ఉన్నారు. వారిని చూసిన బాబు ఈ రోజుకీ రాజకీయం చేయడం ఒక రికార్డు అయితే మారిన కాలంతో మారిన రాజకీయ విలువలతో రాజకీయం చేయడమూ ఒక సవాల్ గానే చూడాలి.

బాబు అదే అంటున్నారు. తాను ఎంతో మందిని రాజకీయంగా చూశాను కానీ వైసీపీ వంటి పార్టీని చూడలేదని. ఇదికూడా నిజమే అనుకున్నా రాజకీయాల్లో మార్పులు ఎవరూ కోరుకున్నట్లుగా ఉండవు. ఆ మాటకు వస్తే ఇతర రంగాలలోనూ అలాగే ఉంటుంది. రాజకీయం చేయడం అంటేనే కత్తి మీద సాము లాంటి వ్యవహారమే.

చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యే అయిన నాటికీ ఈ రోజుకీ పరిస్థితులు ఒకేలా ఉన్నాయా అన్నది కూడా ఒక ప్రశ్న. ఇంకా చెప్పుకుంటే టీడీపీ పెట్టిన నాటికీ ఈ రోజుకీ ఆ పార్టీ గమనం ఎలా ఉందో కూడా ఆలోచించాల్సిన విషయమే. ఇక్కడ బాబు నోటి వెంట ఈ మాటలు రావడమే విచిత్రం.

చాలా మంది నేతల కంటే బాబు అప్టూ డేట్ గా ఉంటారు. అందుకే ఆయన దశాబ్దాలుగా రాజకీయాలు చేయగలుగుతున్నారు. బాబు అందరితో సర్దుకుపోయిన వారే. మరి జగన్ తో ఎందుకు లడాయి అంటే అది అధికారం కోసం పోరాటం. జగన్ ని ఫ్యాక్షనిస్టు అన్నా నేరస్థుడు అని ముద్ర వెసినా కూడా ఆయనకంటూ జనం ఉన్నారు నలభై శాతం ఓటు బ్యాంకు ఉంది.

ప్రత్యర్ధి ఇలాగే ఉండాలని బాబు సహా ఎవరూ కోరుకోలేరు. అలాగని ప్రత్యర్ధి దిగజారుడు పాలిటిక్స్ చేస్తున్నారు అని నిందించినా ఈ కాలంలో వైసీపీని అభిమానించే వారి ఆదరణ తగ్గేది కూడా ఉండదు. బాబు రాజకీయంగా ఇంకా ముందుకు సాగాలంటే జగన్ ఏమిటి ఇంకా చాలా మందిని చూడాలి, చాలా పరిస్థితులను కూడా చూడాలి. అలాగని జగన్ ఏమీ బాబు చెప్పినట్లుగా చెడ్డవారు కాదు, అది బాబు అభిప్రాయం మాత్రమే.

వైఎస్సార్ కాలం నాటి బాబు వైఎస్సార్ కొడుకుతో పోరాటం చేస్తున్నారు అంటే అందులో మెచ్చుకోలూ ఉంది. అదే సమయంలో ఈ రకంగా తరాల మధ్య అంతరాలతో వచ్చే ఇబ్బందులూ ఉంటాయి. ఏది ఏమైనా నామోషీగా ఉంది అన్నా బాబు రాజకీయం ఆగదు, ఆయన జోరూ ఆగదు, అదే సమయంలో వైసీపీని జగన్ ని విమర్శించినా ఆ పార్టీ విధానాలూ మారవు. ఇవన్నీ జస్ట్ పొలిటికల్ గా చేసుకునే జనరల్ కామెంట్స్ గానే అంతా చూస్తారు.