Begin typing your search above and press return to search.

తోడల్లుడి సాహసం గురించి చెప్పిన చంద్రబాబు!

ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాటలు బంద్ కావటమే కాదు.. ఉత్తర దక్షిణ ధ్రువాలుగా మారటం.. కుటుంబ పరంగానూ వేర్వే దారులు అయ్యాయి.

By:  Tupaki Desk   |   6 March 2025 6:07 PM IST
తోడల్లుడి సాహసం గురించి చెప్పిన చంద్రబాబు!
X

మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయాల్లో శాశ్విత శత్రువులు.. శాశ్విత మిత్రులు అంటూ ఎవరూ ఉండరన్న మాట బలంగా వినిపిస్తూ ఉంటారు. అప్పటివరకు కత్తులు దూసుకున్న రాజకీయ అధినేతలు.. కాలం చేసే మార్పులతో ఎలా మారతారన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు..ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా చెప్పాలి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే వేళలోనే ఈ ఇద్దరు అల్లుళ్లు అటు పార్టీలోనూ.. ఇటు ప్రభుత్వంలోనూ తమ పట్టుకోసం తీవ్రంగా ప్రయత్నించేవారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాటలు బంద్ కావటమే కాదు.. ఉత్తర దక్షిణ ధ్రువాలుగా మారటం.. కుటుంబ పరంగానూ వేర్వే దారులు అయ్యాయి.

అయితే..దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు, చంద్రబాబుకు మధ్య విభేదాలు రావటం.. వారిద్దరు వేర్వుగా ఉండటం.. వారి మధ్య మాటలు బంద్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఒక విషయానికి ఇద్దరిని అభినందించాలి. ఎందుకంటే తమ భర్తల మధ్య తేడాలు ఉన్నప్పటికీ.. ఎన్టీఆర్ కుమార్తెల మధ్య మాత్రం బంధం అలానే కంటిన్యూ అయ్యిందని చెప్పాలి. కట్ చేస్తే.. గత ఏడాది ఎన్నికల వేళ కూటమిగా బరిలోకి దిగటం.. తన మరదలు దగ్గుబాటి పురందేశ్వరితో కలిసి పని చేయాల్సి రావటం.. ఆమె కూడా అందుకు తగ్గట్లే సానుకూలంగా స్పందించటం.. కలిసి పని చేయటం ద్వారా చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నారు.

నిజానికి చంద్రబాబు జైలుకు వెళ్లటంతోనే ఈ కుటుంబాల మధ్య దూరం తగ్గినట్లుగా చెబుతారు. అందరూ కలిసి కట్టుగా ఉండేలా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతారు. కట్ చేస్తే.. తాజాగా విశాఖపట్నంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి అతిధిగా హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హాజరయ్యారు.

ఈ ప్రోగ్రాంకు ఎంతమంది అతిధులు వచ్చినా.. తోడళ్లుల మధ్య మాటలు ఎలా ఉంటాయన్న ఆసక్తి నెలకొంది. ఇందుకు తగ్గట్లే.. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తోడల్లుడి మీద ప్రశంసల వర్షం కురిపించారు. ‘దగ్గుబాటి వెంకటేశ్వరరావు నా తోడల్లుడు. ఎన్టీఆర్ వద్ద ఇద్దరం అన్నీ నేర్చుకున్నాం. ఆయన పుస్తకం రాస్తారని నేనెప్పుడూ అనుకోలేదు. రచయిత కానటువంటి రచయిత వెంకటేశ్వరరావు. ఎవరూ చేయని సాహసాన్ని చేశారు. ప్రపంచ చరిత్రలో ఆది నుంచి ఇప్పటివరకు మొత్తం వివరాల్ని పుస్తకంలో పొందుపరిచారు. ఎన్ని కష్టాలు ఉన్నా సంతోషంగా కనిపిస్తారు’’ అని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ విధ్వంస పాలనలో అందరం ఆవేదన చెందామని.. ఇటీవల ఎన్నికల్లో దగ్గుబాటి పురందేశ్వరి చొరవను అందరూ చూశారంటూ తన మనసులోని మాటను చెప్పారు. రాష్ట్ర ప్రజలకు మంచి చేసేందుకు ఉపయోగపడిందన్న చంద్రబాబు మాటల్ని చూసినప్పుడు.. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఐదేళ్ల క్రితం చెప్పినా.. నమ్మేవారు కాదేమో? అందుకే అంటారు అన్నింటికంటే పవర్ ఫుల్ ఏమైనా ఉందంటే అది కాలం మాత్రమే అవుతుందని చెప్పాలి.