Begin typing your search above and press return to search.

బాబు దసరా ఢమాకా

ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది.

By:  Tupaki Desk   |   4 Oct 2024 3:25 AM GMT
బాబు దసరా ఢమాకా
X

టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు దసరా కానుకను ఇస్తుందా అంటే భారీగానే అని ప్రచారం సాగుతోంది. ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు అని అంటున్నారు.

అందులో ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో కొన్నింటిని అయినా దసరా నుంచి అమలు చేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారు అని అంటున్నారు. మహిళలకు దసరా కానుకగా ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే వరాన్ని బాబు ఇవ్వబోతున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతోంది.

మహిళలకు ఉచిత బస్సు సదుపాయం విషయం మీద మంత్రి వర్గం సీరియస్ గనే చర్చిస్తుంది అని అంటున్నారు. ఇప్పటికే ఆర్టీసీ అధికారుల బృందం కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాలలో పర్యటించి వచ్చి మరీ ఒక నివేదికను ప్రభుత్వానికి అందించారు అని అంటున్నారు. ఆ నివేదిక మీద మంత్రి వర్గం కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు.

జిల్లా పరిధిలోనే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. అంటే సొంత జిల్లాలో మహిళలు ఎక్కడ నుంచి ఎక్కడికి అయినా వెళ్లవచ్చు. మరి దీనికి సంబంధించి విధి విధానాలను కూడా ఖరారు చేశారు అని అంటున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఈ చాన్స్ అని అంటున్నారు.

పేదరికమే కొలమానంగా ఈ ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించాలా లేక అందరికీ అవకాశం ఇవ్వాలా అన్న చర్చ కూడా ఉంది. అదే సమయంలో కొన్ని బస్సులను మాత్రమే ఫ్రీ సర్వీస్ కోసం రిజర్వ్ చేసి పెడితే మిగిలిన బస్సులలో ఆదాయం వస్తుంది అలాగే ప్రయాణీకులు అందరూ వాటిలో ప్రయాణించేందుకు వీలు ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారుట.

అదే విధంగా ఈ నెలాఖరున వచ్చే దీపావళి నుంచి ఉచితంగా మహిళలకు మూడు వంట గ్యాస్ సిలిండర్లను కూడా ఇచ్చే పధకానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఇక మహిళలు పద్దెనిమిదేళ్ళు నిండితే చాలు నెలకు 1500 రూపాయలు ఇస్తామన్న దాని మీద కూడా మంత్రి మండలి చర్చిస్తుందని అయితే అది మాత్రం ఇపుడే కాదని విధి విధానాలు పూర్తిగా రూపొందించిన మీదటనే నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు.

అదే విధంగా రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇచ్చే పధకాన్ని కూడా పీఎం కిసాన్ పధకంతో జత చేయడం ద్వారా ఆరు వేల రూపాయల భారాన్ని తగ్గించుకుంటూ మిగిలిన మొత్తానికి విడతల వారీగా అందచేయడానికి చూస్తున్నారని చెబుతున్నారు.

ఈ పధకాన్ని సంక్రాంతికి అమలు చేసే విషయం కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చిస్తారు అని అంటున్నారు. ఇక తల్లికి వందనం పధకం అయితే వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని అనుకుంటున్నారు. ఏది ఎమైనా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యేలోపుగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అన్నీ అమలు చేయాలని పట్టుదలగా ఉన్నారని అంటున్నారు.

వైసీపీ నుంచి ఏ ఒక్క విమర్శ రాకుండా ఈ పధకాలను అమలు చేసి తమ సత్తా నిరూపించుకోవాలని టీడీపీ కూటమి చూస్తోంది అని అంటున్నారు. మొత్తానికి ఫ్రీ బస్సు పధకం కనుక దసరాకు అమలు అయితే మహిళలకు పెద్ద బహుమతే బాబు ఇస్తున్నట్లుగా భావించాలి అని అంటున్నారు