Begin typing your search above and press return to search.

లోకేష్ కి పెద్ద పని చెప్పిన చంద్రబాబు!

అయితే తెలుగుదేశంలో బాబు డిప్యూటీ ఎవరూ అంటే కచ్చితంగా రెండవ మాట లేకుండా లోకేష్ బాబు అని చెప్పాల్సిందే.

By:  Tupaki Desk   |   30 Sep 2024 2:30 AM GMT
లోకేష్ కి పెద్ద పని చెప్పిన చంద్రబాబు!
X

తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు సీఎం అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆయన మిత్ర పక్ష నేత. అలా ఆయనకు సమాదరణ లభిస్తోంది. అయితే తెలుగుదేశంలో బాబు డిప్యూటీ ఎవరూ అంటే కచ్చితంగా రెండవ మాట లేకుండా లోకేష్ బాబు అని చెప్పాల్సిందే.

ఎందుకంటే బాబు పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయితే లోకేష్ బాబు జాతీయ ప్రధాన కార్యదర్శి. బాబు సీఎం అయితే లోకేష్ కూడా ఆయనకు అన్ని విధాలుగా సహకరించే తరువాత స్థానంలో ఉన్నారు అని అంటారు. ఇక లోకేష్ అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ అతి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అని చెబుతారు. ఆయన ప్రమేయం లేకుండా ఏదీ జరగదు అని అంటారు. మంత్రివర్గ సమావేశాలు జరిగితే చంద్రాబాబుకు కుడువైపున మొదటి సీటులో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉంటే ఎడమ వైపున మొదటి సీటులో నారా లోకేష్ కనిపిస్తారు. ఆ తరువాత ప్లేస్ లోనే మిగిలిన మంత్రులు ఉంటారు

ఇక ప్రోటోకాల్ ప్రకారం చూస్తే మూడు ప్రధాన శాఖలు టాప్ త్రీ గా వస్తాయని చెబుతారు. ముఖ్యమంత్రి తరువాత వెంటనే నంబర్ టూ ఎవరు అంటే ఆర్ధిక మంత్రి వస్తారు. ఆ తరువాత హోం మంత్రి వస్తారు, మూడవ ప్లేస్ లో రెవిన్యూ మంత్రి ఉంటారు. ఆ తరువాత పంచాయతీ రాజ్, శాసన సభా వ్యవహరాలు మునిసిపల్ శాఖ వంటివి వస్తాయని అంటారు.

అయితే ఇపుడు చూస్తే ఆ శాఖలను నిర్వహిస్తున్న వారు అంతా వెనక వరసలోనే ఉంటున్నారు. ఇక్కడ రాజకీయంగా పవన్ లోకేష్ కీలకం కాబట్టి వారికే ప్రయారిటీ ఇస్తున్నారు అని అంటున్నారు. ప్రతీ శాఖకు సంబంధించిన అంశాలను ఆ మంత్రి మాట్లాడుతారు.

అయితే ఒక్క ముఖ్యమంత్రికి మాత్రం అన్ని శాఖల మీద మాట్లాడే పూర్తి స్వేచ్చ ఉంది. ఎందుకు అంటే రాజ్యాంగం ప్రకారం ఆయనే మంత్రి మండలికి అధిపతి కాబట్టి. ఇక ఇపుడు చూస్తే అన్ని శాఖల గురించి అన్ని సమస్యల గురించి అటు పవన్ ఇటు లోకేష్ కూడా మాట్లాడుతున్నారు అని గుర్తు చేసుకోవాల్సి ఉంది.

దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే తిరుమల లడ్డూ వివాదం గురించి పవన్ లోకేష్ ఇద్దరూ మాట్లాడారు. దీని మీద సీపీఐ రామక్రిష్ణ కూడా ఎత్తి చూపారు. సీఎం దేవాదాయ మంత్రి మాట్లాడాల్సిన శాఖల గురించి పవన్ కి ఎందుకు అని కూడా ప్రశ్నించారు

మరో వైపు చూస్తే లోకేష్ ప్రాధాన్యత అంతకంతకు ప్రభుత్వంలో పెరుగుతోంది. దాంతో ఆయనకు ఇపుడు మరింత ప్రాముఖ్యతను కల్పిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే కన్సల్టేటివ్ ఫోరం చైర్మన్ గా లోకేష్ ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సీఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ దాని బాధ్యతలు లోకేష్ కి అప్పగించారు. రెండేళ్ల కాల వ్యవధితో పనిచేసే దీనికి చైర్మన్ గా లోకేష్ వ్యవహరిస్తారు.

ఈ ఫోరం లక్ష్యం ఏంటి అంటే పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా చేసుకుంటుంది. ప్రభుత్వానికి పారిశ్రామికవేత్తలకు మధ్య అనుసంధానకర్తగా ఇది పనిచేస్తుంది. ప్రభుత్వ శాఖలను ఆర్టీజీఎస్ శాఖ కో ఆర్డినేట్ చేస్తుంది. అంటే లోకేష్ కి చాలా పెద్ద పనినే బాబు అప్పగించారు అన్న మాట. ఏపీలో పెట్టుబడులు తెస్తామని చంద్రబాబు ముందు నుంచి చెబుతూ వస్తున్నారు.

ఇపుడు ఆ బాధ్యతలను కుమారుడు కీలక శాఖలను మంత్రి అయిన లోకేష్ చేతిలోనే పెట్టారు. మరి ఈ కొత్త పదవిలో లోకేష్ తన సత్తా చాటుకుని పరిశ్రమలను ఏపీకి రప్పించాల్సి ఉంటుంది. ఆ విధంగా ఆయన సమర్ధతతో పాటు ఫ్యూచర్ ఆఫ్ ఏపీగా కూడా ఆయన ఉండే చాన్స్ ఉంటుంది అని అంటున్నారు.