Begin typing your search above and press return to search.

విజయసాయిరెడ్డి కూతురును టార్గెట్ చేసిన చంద్రబాబు సర్కార్

అలాగే.. అధికారం ఉంది కదా అని కబ్జాలు, అక్రమాలకు పాల్పడే వారూ ఎక్కువే.

By:  Tupaki Desk   |   4 Sep 2024 7:18 AM GMT
విజయసాయిరెడ్డి కూతురును టార్గెట్ చేసిన చంద్రబాబు సర్కార్
X

రాజకీయాల్లో ఓ టర్మ్ ఓ పార్టీ అధికారంలోకి వస్తే.. అదే ఆదరణ కొనసాగితే మళ్లీ అదే పార్టీ అధికారం చేపట్టడం ఖాయం. ఒకవేళ ప్రజల్లో వారి పాలనపై అసంతృప్తి నెలకొంటే మాత్రం వేరే పార్టీ వైపు మొగ్గు చూపుతారు. అధికారంలో ఉన్నప్పుడు.. అపోజిషన్ లీడర్లతో రాజకీయ వైరం కూడా కామన్. అలాగే.. అధికారం ఉంది కదా అని కబ్జాలు, అక్రమాలకు పాల్పడే వారూ ఎక్కువే. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నో దందాలు, దౌర్జన్యాలూ జరుగుతుంటాయి.

కట్ చేస్తే.. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పలువురు నేతలు కబ్జాలకు పాల్పడ్డారని కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు పలు సందర్భాల్లో ఆరోపించారు. అధికారం ముసుగులో పెద్ద స్థాయిలో భూములు ఆక్రమించారని ఆరోపణలు చేశారు.

ఈ క్రమంలోనే వైసీపీ నేత విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి అక్రమాలపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్, మరికొందరు కూటమి నేతలు న్యాయస్థాయాన్ని ఆశ్రయించారు. భీమిలి తీరంలో సీఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు నిర్మించారని ప్రధానంగా ఆరోపించారు. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. విచారించి భీమిలి తీరంలో వెలిసిన కట్టడాలు అక్రమమేనని తేల్చింది. వాటిని వెంటనే తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

కోర్టు తీర్పుతో అధికారులు రంగంలోకి దిగారు. విశాఖ జిల్లా భీమిలి తీరంలో నేహారెడ్డి చేపట్టిన అక్రమ కట్టడాల వద్దకు జీవీఎంసీ అధికారులు చేరుకున్నారు. ఉదయం నుంచే ఆ కట్టడాలను కూల్చివేయడం ప్రారంభించారు. భీమిలి జోన్ పట్టణ సహాయ ప్రణాళిక అధికారి బి.శ్రీనివాస రావు ఆధ్వర్యంలో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బీచ్ ఒడ్డున హోటల్ కోసం వేసిన పిల్లర్స్, గోడలు, ఇతర నిర్మాణాలను తొలగిస్తున్నారు. అయితే.. ఈ తొలగింపు ప్రక్రియకు ఎవరూ కూడా అడ్డు రాకపోవడంతో సజావుగానే సాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. భూ అక్రమాలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.