మహిళలకే కాదు.. తమ్ముళ్లకూ `దీపావళి` చేస్తున్న చంద్రబాబు!
సుమారు కోటి మందికి లబ్ది కలిగించనున్న దని పార్టీ, ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
By: Tupaki Desk | 27 Oct 2024 5:24 PM GMTమరో నాలుగు రోజుల్లో రాష్ట్రంలో దీపావళి పండుగ రానుంది. దీనిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు మహిళలకు పెద్ద ఎత్తున పండుగ కానుక ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికలకు ముందు ప్రకటించిన సూప ర్ సిక్స్ హామీల్లో ఒకటైన.. దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లను ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ పథకాన్ని దీపావళి రోజు ఆయన ప్రారంభించనున్నారు. సుమారు కోటి మందికి లబ్ది కలిగించనున్న దని పార్టీ, ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇక, ఇప్పుడు మహిళలతో పాటు.. పార్టీ నాయకులకు కూడా చంద్రబాబు దీపావళి పండుగ చేయనున్న ట్టు టీడీపీ సీనియర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో నామినేటెడ్ పదవులను దీపావళి పండుగ సందర్భంగా చంద్రబాబు భర్తీ చేయనున్నట్టు తెలిసింది. ఇప్పటికే 21 పదవులను ఆయన టీడీపీ సహా బీజేపీ, జనసేన పార్టీ నాయకులకు ఇచ్చారు. ఇక, మిగిలిన పదవుల్లో కీలకమైన 40 నామినేటెడ్ స్థానాలను దీపావళి సందర్భంగా భర్తీ చేయనున్నట్టు తెలిసింది.
దీనిలో భాగంగా ఆదివారం చంద్రబాబు కూటమి పార్టీల కీలన నేతలతో వీసీ ద్వారా చర్చలు జరిపారని తెలిసింది. మొదటి దశలో దాదాపు 21 కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను ప్రకటించగా, రెండో దశలో టీటీడీ బోర్డు, వివిధ దేవాలయాల పాలక మండళ్లు, సామాజిక వర్గాల కార్పొరేషన్లకు చెందిన ఛైర్మన్, చైర్ పర్సన్, వైస్ చైర్మన్ పదవులు ఇవ్వనున్నట్టు సీనియర్ నాయకులు మీడియాకు ఉప్పందించారు.
తొలిసారి ప్రకటించిన 21 స్థానాల్లో 3 కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు జనసేనకు, ఒక కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించారు. ఇప్పుడు ప్రకటించే 40 పదవుల్లోనూ వారికి కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. మొత్తంగా కూటమి పార్టీలకు 20 శాతం పదవులు ఇవ్వాలని చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో దీపావళి సందర్భంగా పార్టీ నాయకులకు కూడా చంద్రబాబు తీపి కబురు అందించనున్నట్టు స్పష్టమైంది.