తిరుమల లడ్డూ మీద చంద్రబాబు హాట్ కామెంట్స్!
ఆయన ఎన్డీయే శాసన సభా పక్ష సమావేశంలో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకాలు ఇన్నీ అన్నీ కావు అని చాలా చెప్పారు.
By: Tupaki Desk | 18 Sep 2024 4:15 PM GMTటీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం మీద సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఎన్డీయే శాసన సభా పక్ష సమావేశంలో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకాలు ఇన్నీ అన్నీ కావు అని చాలా చెప్పారు.
సడెన్ గా చంద్రబాబు తిరుమల శ్రీవారి మీదకు టాపిక్ మళ్ళించారు. ఒక్కోసారి కొన్ని విషయాలు తలచుకుంటే బాధ వేస్తుంది అని అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం నెయ్యి కాకుండా నాసిరకం పదార్ధాలు ఉపయోగించారు అని బాబు ఫైర్ అయ్యారు.
ఆఖరుకు ఆనిమల్ ఫాట్ కూడా లడ్డూ ప్రసాదంలో వాడారని బాబు బాంబు లాంటి వార్తనే పేల్చారు. ఇది తన దృష్టికి వచ్చిందని అన్నారు. ప్రపంచ దేవుడు శ్రీవారినే గత ప్రభుత్వం అన్ని రకాలుగా అవమానించి బాధ పెట్టిందని చంద్రబాబు అన్నారు.
శ్రీవారి ఆలయంలో పవిత్రతను దెబ్బ తీశారు అని ఆయన అన్నారు. తిరుమలలో ప్రసాదం తయారీలో నాణ్యత అన్నది ఎక్కడా లేకుండా చేశారని అన్నారు. ప్రపంచం మొత్తం తిరుమలకు వచ్చి దర్శించుకునే శ్రీవారు తిరుమలలో ఉండడం అందరికీ గర్వ కారణం అని అన్నారు.
అలాంటి స్వామి విషయంలో వైసీపీ నేతలు దుర్మార్గంగా ప్రవర్తించారని ఆయన అన్నారు. స్వామి వారి ప్రసాదం తయారీకి నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వుని వాడారన్న వార్తలు తెలిసి తాను ఎంతో బాధపడ్డాను అని బాబు అన్నారు.
అంతే కాకుండా అన్న దానంలో సైతం నాణ్యత లేకుండా చేశారని ఆయన ఫైర్ అయ్యారు. తాను ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక తిరుమలలో పవిత్రత మళ్లీ వచ్చింది అని అన్నారు. శ్రీవారు ఏపీని చల్లగా చూస్తాడు అన్న నమ్మకం ఉందని అన్నారు.
మొత్తం మీద చూస్తే చంద్రబాబు చేసిన ఈ కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. నిజంగా జంతువుల కొవ్వు ని వాడారా లేదా అన్నది వైసీపీ నేతలు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రపంచ దేవుడు శ్రీవారు. ఆయన విషయంలో ఏ రకమైన ప్రచారం జరిగినా అది భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తుంది. కచ్చితంగా దాని ఎఫెక్ట్ వైసీపీ మీద ఉంది. అందువల్ల వారు బాబు చేసిన కామెంట్స్ మీద ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే అని అంటున్నారు.