అన్ని పర్యటనలు రద్దు.. విజయవాడలోనే ఉంటా: చంద్రబాబు
విజయవాడ కలెక్టర్ బంగ్లాను ప్రస్తుతం సీఎం చంద్రబాబుకు తాత్కాలిక కార్యాలయంగా మార్చేశారు.
By: Tupaki Desk | 1 Sep 2024 4:30 PM GMTఏపీ సీఎం చంద్రబాబు తన అధికారిక పర్యటనలను రద్దు చేసుకున్నారు. ముఖ్యంగా వియ్యంకుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య సినీ ప్రస్థానానికి సంబంధించిన స్వర్ణోత్సవ వేడుకలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరు కావాల్సి ఉంది. అయితే.. విజయవాడ సహా.. గుంటూరు.. తదితర ప్రధాన పట్టణాలు జలదిగ్భంలో చిక్కుకుపోయిన దరిమిలా.. చంద్రబాబు విజయవాడలోనే ఉండి.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విజయవాడ కలెక్టర్ బంగ్లాను ప్రస్తుతం సీఎం చంద్రబాబుకు తాత్కాలిక కార్యాలయంగా మార్చేశారు.
విజయవాడలోని పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు.. నేరుగా కలెక్టరేట్ వద్దకు వచ్చి అక్కడే సమీక్షించారు. అవసరమైతే బస్సులోనే ఇవాళ సీఎం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు బాలయ్య తో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు వరదల నేపథ్యంలో స్వర్ణోత్సవ వేడుకలకు రావటం లేదని అన్నారు. ఇదిలావుంటే, విజయవాడలో సాధారణస్థితి వచ్చేవరకు కలెక్టరేట్‌లోనే ఉంటానని చంద్రబాబు చెప్పారు. సీఎం వెంట కలెక్టరేట్‌లోనే హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు. రాష్ట్రంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
మరోవైపు.. వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారికి సరఫరా చేసేందుకు దాదాపు 6 వేల మందికి ఆహారం ఏర్పాటు చేసినట్లు ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఆహార సరఫరాలో ఇబ్బంది రాకుండా చూడాలని హోంమంత్రి అనితకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆహార ప్యాకింగ్, సరఫరా బాధ్యత అక్షయపాత్ర, ఇతర సంస్థలకు అప్పగించారు. ఆదివారం రాత్రి అయినప్పటికీ.. బాధితులకు ఆహారం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు.. ఆహార ప్యాకింగ్, సరఫరా పనులకు ముందుకొచ్చిన టీడీపీ శ్రేణులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. అదేవిదంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.