Begin typing your search above and press return to search.

సాఫ్ట్ టోన్ తో బాబు...ఆ ఊసే లేకుండా !

దాంతో పాటు ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన పలు వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిని కలిగించాయి.

By:  Tupaki Desk   |   1 Oct 2024 3:49 PM GMT
సాఫ్ట్ టోన్ తో బాబు...ఆ ఊసే లేకుండా !
X

ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు పర్యటన మీద సర్వత్రా ఆసక్తి కనిపించింది. ఎందుకు అంటే సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శ్రీవారి లడ్డూల విషయంలో ఎలాంటి ఆధారాలు లేకుండా రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న సీఎం ఎలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతారు అని పేర్కొంది.

దాంతో పాటు ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన పలు వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిని కలిగించాయి. దాంతో సుప్రీంకోర్టు వ్యాఖ్యల తరువాత ఇరవై నాలుగు గంటలు తిరగకుండా చంద్రబాబు కర్నూల్ టూర్ పెట్టుకున్నారు.

ఇక సుప్రీంకోర్టు వ్యాఖ్యల తరువాత టీడీపీ నుంచి ఎవరైనా రెస్పాండ్ అవుతారు అని చూసినా ఏమీ జరగలేదు. దాంతో ముఖ్యమంత్రి దీని మీద ఏమైనా మాట్లాడుతారు అని అంతా అనుకున్నారు. కానీ చంద్రబాబు చాలా జాగ్రత్తగా మాట్లాడారు.

ఆయన కర్నూల్ లో పెన్షన్ల పంపిణీలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పూర్తిగా అభివృద్ధి గురించి ప్రభుత్వ కార్యక్రమాల గురించి మాత్రమే ఆయన మాట్లాడారు. తాను పెన్షన్లు ఎప్పటికపుడు పెంచుతూ పేదలకు న్యాయం చేస్తున్నాను అని ఆయన వివరించారు.

ఎన్టీఆర్ హయాంలో ముప్పయి అయిదు రూపాయలు ఉన్న సమాజిక పెన్షన్లు తాను 1995లో సీఎం అయ్యాక డెబ్బై అయిదు రూపాయలకు పెంచాను అని గుర్తు చేశారు. ఆ తరువాత తానే 200 రూపాయలు ఉన్న పెన్షన్లను ఒక్కసారిగా వేయి రూపాయలకు పెంచానని తిరిగి 2019 ఎన్నికల ముందు 2000 రూపాయలకు పెంచాను అని చెప్పారు. ఇపుడు చూస్తే మూడు వేల రూపాయల పెన్షన్ ని నాలుగు వేల రూపాయలకు పెంచాను అని ఆయన చెప్పారు.

ఏపీలో ఇరవై లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతోందని పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏపీకి వచ్చేలా చూస్తున్నామని కూడా వెల్లడించారు. ఇక గత ప్రభుత్వం చేసిన పనుల వల్ల ఖజానాకు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు మిగిలిందని బాబు చెప్పారు. ఆ అప్పులకు పెద్ద ఎత్తున వడ్డీని కట్టాల్సి వస్తోందని ఆయన వివరించారు.

అయినా ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎక్కడా తీవ్ర వ్యాఖ్యలు వైసీపీ మీద చేయలేదు గత ప్రభుత్వం అని మాత్రమే అంటూ వచ్చారు. అదే సమయంలో జగన్ పేరుని ప్రస్తావించలేదు, ఆయన తాను చేమి చేశాను, ఏమి చేయబోతాను అని మాత్రమే చెప్పారు.

అదే సమయంలో ఆయన ఎక్కడా లడ్డూ గురించి కానీ శ్రీవారి ప్రసాదం గురించి ప్రస్తావించలేదు. ఆ అంశం మాట్లాడకూడదని ఒట్టు పెట్టుకున్నట్లుగానే మాట్లాడారు. దాంతో చంద్రబాబు ఈ విషయంలో చాలా అలెర్ట్ అయి వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు

దేవుళ్ళను రాజకీయాల్లోకి ఎందుకు తీసుకుని వస్తున్నారు అన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల ప్రభావమా లేక ఈ నెల 3న సుప్రీం కోర్టులో తీర్పు ఉంది కాబట్టి దాని గురించి వేచి ఉండడమా అన్నది తెలియదు కానీ మొత్తానికి బాబు మాత్రం లడ్డూ ఇష్యూ గురించి అసలు మాట్లాడలేదు. ఇది రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసిన విషయమే.

అయితే ఈ విషయంలో టీడీపీ ఇక మీదట పెద్దగా స్పందించకూడదు అని నిర్ణయం తీసుకుంది అని కూడా అంటున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ఏ విధంగా ఆ మీదట ఏ రకమైన విచారణ జరిగినా కూడా ఆ అంశం టీటీడీకి మాత్రమే పరిమితం చేసేలా ప్రభుత్వ వైఖరి ఉంటుంది అని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు చాలా సాఫ్ట్ మోడ్ లో తన ప్రసంగాన్ని సాగించారు. అలాగే ఆయన ఎటువంటి వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళకూడదని భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.