తమ్ముళ్ల నోటికి చంద్రబాబు తాళం.. కిక్కురుమంటే ఒట్టు!
ఈ సందర్భంగా వారు.. గతంలో తాము అనేక ఇబ్బందులు పడ్డామని.. పార్టీ కోసం జైళ్లకు కూడా వెళ్లామని చెబుతున్నారు.
By: Tupaki Desk | 11 Oct 2024 4:27 AM GMTఎవరిని పలకరించినా.. నామినేటెడ్ పదవుల గురించే మాట్లాడుతున్నారు. పార్టీ కార్యాలయానికి ఏ త మ్ముడు వచ్చినా.. 'సర్.. నాకు' అంటూ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సైతం క్యూ కడుతున్న నాయకులు.. పదవుల కోసమే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ సందర్భంగా వారు.. గతంలో తాము అనేక ఇబ్బందులు పడ్డామని.. పార్టీ కోసం జైళ్లకు కూడా వెళ్లామని చెబుతున్నారు. మరికొందరు.. ఎఫ్ ఐఆర్ కాపీలను కూడా పార్టీకి చూపిస్తున్నారు.
ఇక, ఇంకొందరు నాయకులు మరో అడుగు ముందుకు వేసి.. నారా లోకేష్ చేసిన పాదయాత్ర సందర్భం గా తమకు అనేక హామీలు ఇచ్చారని, యువగళం పాదయాత్రను విజయవంతం చేసేందుకు ఎంతో కృషి చేశామని కూడా చెబుతున్నారు. ఈ విన్నపాలు.. విజ్ఞప్తులు చేసేవారితోనే పార్టీ కార్యాలయం నిత్యం రద్దీగా ఉంటోంది. పోనీ.. పదవులు ఇచ్చేద్దామా? అంటే.. చాలినన్ని పదవులు లేక పోవడం గమనార్హం. చైర్మన్లు, వైఎస్ చైర్మన్లు, బోర్డుల సభ్యులు ఇలా ఎన్నికలుపుకొన్నా 2 వేల పదవులకు మించి లేవు.
కానీ, వస్తున్నదరఖాస్తులను పరిశీలిస్తే మాత్రం చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పటి వరకు 40 వేల మంది పార్టీ నాయకులు పదవుల కోసం లైన్‌లో ఉన్నారు. దీంతో చంద్రబాబుకు తలనొప్పులు పెరిగి పోతున్నాయి. మరోవైపు.. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేనలు కూడా దూకుడుగానే ఉంటున్నాయి. తమ కు కూడా పదవులు ఇవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఎవరైతే కేసులు పెట్టించుకున్నాం.. ఇబ్బందులు పడ్డాం అని చెబుతున్నారో.. వారికి షాక్ ఇచ్చారు.
తనకంటే కూడా పార్టీలో బాధితులు ఎవరూ లేరని ఆయన తేల్చి చెప్పడం ద్వారా.. ఇక నుంచి నాయ కులు .. వైసీపీ హయాంలో తాము జైలుకు వెళ్లామని.. అందుకే పదవులు కోరుతున్నామని చెబుతున్న వారికి ఆయన తన అనుభవాలను వివరిస్తూ.. ``నా కన్నా.. బాధితులు ఎవరూ లేర``ని మొహం మీదే చెబుతున్నారు. 53 రోజులు జైల్లో ఉండడం.. ప్రభుత్వం నుంచి విమర్శలు ఎదుర్కొనడం కంటే.. ఆవేదన బాధ ఏముంటుందని చంద్రబాబు ప్రశ్నించారు. దీంతో ఇప్పుడు పదవుల కోసం పోటీ పడుతున్న నాయకులు సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టడం గమనార్హం.