Begin typing your search above and press return to search.

ఏమిటీ కేఎస్ఎస్? టీడీపీలో ఈ కొత్త వ్యవస్థ ఎలా పని చేస్తుంది?

ఇప్పటివరకు పార్టీ తీరుకు భిన్నంగా కొత్త కాన్సెప్టును తెర మీదకు తీసుకొచ్చారు.

By:  Tupaki Desk   |   2 March 2025 11:00 AM IST
ఏమిటీ కేఎస్ఎస్? టీడీపీలో ఈ కొత్త వ్యవస్థ ఎలా పని చేస్తుంది?
X

భిన్నంగా ఆలోచించే గుణం టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎక్కువ. ఆయనతో వచ్చే చిక్కేమంటే.. ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. కానీ.. వాటి అమలు విషయంలోనే తేడా కొట్టేస్తూ ఉంటుంది. ఆయన చెప్పిన మాటల్ని చెప్పినట్లుగా అమలు అయ్యేలా చేయగలిగితే అద్భుతాల్ని క్రియేట్ చేయటం చాలాతేలిక. పార్టీ వ్యవస్థకు సంబంధించి తాజాగా ఆయనో కొత్త కాన్సెప్టును తెర మీదకు తీసుకొచ్చారు. ఇప్పటివరకు పార్టీ తీరుకు భిన్నంగా కొత్త కాన్సెప్టును తెర మీదకు తీసుకొచ్చారు. దీన్ని ‘‘కేఎస్ఎస్’’గా పేర్కొంటున్నారు.

ఇంతకూ దీని అర్థం ఏమంటే.. కుటుంబ సాధికార సారధులు. తెలుగుదేశం పార్టీలో తాను మొదలు కొని ప్రతి ఒక్కరూ కేఎస్ఎస్ సభ్యులుగానే ఉండాలన్నారు. క్లస్టర్.. యూనిట్.. బూత్ (క్యూబ్) కమిటీల్లో ఏదో ఒక ధానికి కన్వీనర్ గా ఉండాలన్న చంద్రబాబు ఈ కేఎస్ఎస్ గురించి మరింత ఆసక్తికర సమాచారాన్ని చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లోనే చూస్తే.. ‘‘నేను నా నియోజకవర్గంలో ఒక కేఎస్ఎస్ సభ్యుడిగా ఉండి పార్టీకి మెజార్టీ సాధిస్తేనే ఎన్నికల్లో పోటీకి అర్హుడిని. పురుషులతో పాటు మహిళలు సమానంగా నాయకత్వం పెరగాలి. కేఎస్ఎస్ లుగా వారికి కేటాయించిన 60 మంది బాగోగులను పట్టించుకోవాలి. వారంతా పార్టీ కోసం పని చేసేలా చేయాలి. అప్పుడు మాత్రమే అసెంబ్లీ.. లోకసభ స్థానాల్లో పోటీ చేసేందుకు.. పార్టీ టికెట్లను సొంతం చేసుకోవటానికి అర్హత సాధిస్తారు’’ అని చెప్పుకొచ్చారు.

ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరూ తనను టికెట్లు అడగొద్దన్న చంద్రబాబు.. ప్రజలు ఎవరిని ఆమోదిస్తారో? కార్యకర్తలు ఎవరికి టికెట్ ఇవ్వాలని చెబుతారో.. వారిని మాత్రమే ఎంపిక చేస్తాం. తానీ విషయాన్ని ఎన్నికల ముందు చెప్పానని.. దాన్నే తూచా తప్పకుండా పాటిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు కూడా ప్రతి ఆర్నెల్లకు ఒకసారి మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేల పని తీరుపై నివేదికలు తెప్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అవసరమైతే వారు తమ పని తీరును మార్చుకోవాల్సిందేనని పేర్కొన్నారు. ఈ కొత్త కేఎస్ఎస్ విధానం చంద్రబాబు మాటల్లో విన్నప్పుడు బాగానే ఉన్నా.. అమలు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్న. దీనికి కాలమే సరైన సమాధానం చెబుతుందని చెప్పాలి.