అప్పుడు - ఇప్పుడు... మారని తమ్ముళ్లు.. !
ఈ క్రమంలోనే అప్పట్లోనూ ఉచిత ఇసుక, అధికారులపై పెత్తనం, ప్రజల నుంచి మామూళ్లు వసూలు చేయడం చేశారు.
By: Tupaki Desk | 29 Aug 2024 9:45 AM GMT014-19 మధ్య ఏ తరహాలో టీడీపీ ఎమ్మెల్యేలు రాజకీయాలు చేశారో.. ఇప్పుడు అంతకు మించి చేస్తున్నా రనే టాక్ వినిపిస్తోంది. నిజానికి అప్పట్లో కొంత గ్యాప్ తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఏడాది పాటు తమ్ముళ్లు పరిస్థితులను అర్ధం చేసుకునేందుకు సంయమనం పాటించారు. ఆ తర్వాత.. ఎవరికి వారే రాజకీయాలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే అప్పట్లోనూ ఉచిత ఇసుక, అధికారులపై పెత్తనం, ప్రజల నుంచి మామూళ్లు వసూలు చేయడం చేశారు.
ఈ పరిణామాలతో పార్టీ బాగా దెబ్బతింది. ఓవర్ హెడ్ ట్యాంకు బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో పంపులు తుప్పు పట్టిపోయినట్టుగా.. చంద్రబాబు మంచి నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు అని పేరుతెచ్చుకు న్నా.. నియోజకవర్గాల్లో నాయకులు భ్రష్టు పట్టిపోయారు. దీంతో పార్టీ అధికారం కోల్పోయింది. ఇక, 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఈ విషయం చెప్పుకొని బాధపడ్డారు. ``నన్ను చూసి ఓటేయండి. కొన్ని తప్పులు జరిగాయి. సరిచేస్తాను`` అని వేడుకున్నారు.
అయినా.. ప్రజలు చంద్రబాబును పట్టించుకునే స్థాయిలో కనిపించలేదు. ఇక, ఇప్పుడు తమ్ముళ్లు అసలు గ్యాప్ కూడా తీసుకోవడం లేదు. వారిదే రాజ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో ఏడాది పాటైనా ఆగారు. ఇప్పుడు రెండు నెలలు కూడా కాకముందే.. తన దైన శైలిలో విజృంభిస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబాలు కూడా ఒక పద్ధతి లేకుండా వ్యవహరిస్తున్నాయి. అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తే.. ఏదో రాజకీయం అనుకోవచ్చు.
కానీ, టీడీపీ అనుకూల మీడియాల్లోనే తమ్ముళ్ల ఆగడాలకు సంబంధించిన వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 మంది ఎమ్మెల్యేల పనితీరు.. గందరగోళంగానే కాకుండా.. పార్టీకి కూడా ఇబ్బందులు సృష్టించేలా మారిపోయింది. దీనివల్ల వారు ఇప్పటికిప్పుడు ఆనంద పడొచ్చు. కానీ, ప్రజా కోణంలో చూసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. దీనికి చంద్రబాబు ఇప్పటి నుంచే బ్రేకులు వేయాల్సి ఉంది. లేకపోతే మరిన్ని ఇబ్బందులు ఖాయం.