Begin typing your search above and press return to search.

ట్రెడిషన్ మారుస్తున్న బాబు... వైసీపీని కాదని జనసేనకు చాన్స్ ?

పీఏసీ చైర్మన్ పదవిని సాధారణంగా ప్రతిపక్షానికి ఇస్తారు.

By:  Tupaki Desk   |   21 Nov 2024 7:30 AM GMT
ట్రెడిషన్ మారుస్తున్న బాబు... వైసీపీని కాదని జనసేనకు చాన్స్ ?
X

చట్ట సభలలో కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. వాటి ప్రకారమే సభలు నడుస్తూ ఉంటాయి. అయితే ఆ సంప్రదాయాలను పాటించాలా వద్దా అన్నది పాలకుల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉంటే ఏపీలో కీలక పదవులు అన్నీ భర్తీ చేసుకుంటూ వస్తున్న కూటమి ప్రభుత్వం కీలకమైన ప్రజా పద్దుల సంఘం చైర్మన్ పదవిని కూడా భర్తీ చేయాలని చూస్తోంది. దీనినే ఇంగ్లీష్ లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని అంటారు.

పీఏసీ చైర్మన్ పదవిని సాధారణంగా ప్రతిపక్షానికి ఇస్తారు. వారికి ఎంత బలం అన్నది కూడా అక్కడ చూడరు. ఎందుకంటే ఇదంతా పారదర్శకంగా ఉండాలేనే ఈ ఆనవాయితీని పెట్టారు. ప్రభుత్వం ప్రతీ రంగంలో పెట్టే ఖర్చులు చేసే కేటాయింపులు వీటి మీద ప్రతిపక్షమే మధింపు చేస్తే ఇంకా బలంగా నివేదిక ఉంటుందన్న ఉద్దేశ్యంతో వారికే ఆ పదవిని కట్టబెడతారు.

గత వైసీపీ ప్రభుత్వంలో ఈ పదవిని ప్రస్తుత ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ కి ఇచ్చారు. ఆయన టీడీపీ ఎమ్మెల్యే. ఇక అంతకు ముందు 2014లో ఈ పదవిని వైసీపీకి చెందిన బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డికి ఇచ్చారు. ఇపుడు చూస్తే సంప్రదాయం ప్రకారం వైసీపీకి ఇవ్వాలి. కానీ వైసీపీ సభకే హాజరు కావడం లేదు అని అంటున్నారు.

ఇక చూస్తే పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఉభయ సభల నుంచి మెంబర్స్ ఉంటారు. అలా కనుక ఆలోచిస్తే వైసీపీకి 30 మందికి పైగా ఎమ్మెల్సీలు కౌన్సిల్ లో ఉన్నారు. అలాగే అసెంబ్లీలో 11 మంది కలుపుకుని 40 పై దాటి ఉంటారు. సో అలా వైసీపీకి ఈ పోస్ట్ ఇవ్వడం నూరు శాతం కరెక్ట్. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో శాసన సభ, శాసన మండలి సభ్యులు కూడా ఉంటారు. అలాగే చైర్మన్ గా విపక్ష నేతకు చాన్స్ ఇచ్చినా అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా మెంబర్స్ గా ఉంటారు.

పేఏసీ చైర్మన్ కీలకమైన పదవి, కేబినెట్ హోదా ఉన్న పోస్ట్. ఇప్పటికే శాసనమండలిలో వైసీపీకి ఒక కేబినెట్ పోస్ట్ బొత్స సత్యనారాయణ రూపంలో దక్కింది. మరో పోస్ట్ కూడా దక్కే అవకాశాలు ఉన్నాయి. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం ఆలోచించే విధానం మీదనే అది ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

పీఏసీ చైర్మన్ పదవిని కూటమి వైసీపీకి ఇస్తుందా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే వైసీపీ అసెంబ్లీకి రావడం లేదు, ఏ ప్రతిపక్షం వ్యవహరించని తీరులో ఆ పార్టీ విధానం ఉందని అంటున్నారు. దాంతో పాటుగా కూటమిలో ఉన్న జనసేనకు ఈ పదవి ఇవ్వాలని కూటమి పెద్దలు భావిస్తున్నారు అని టాక్ అయితే నడుస్తోంది.

జనసేనకు ముగ్గురు మంత్రులు ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ చాన్స్ కూడా వదులుకుంది. మరో కేబినెట్ పోస్ట్ కనుక ఇవ్వాలీ అనుకుంటే పీఏసీ చైర్మన్ పదవిని మించి లేదు. అయితే ప్రతిపక్షానికే ఈ పదవి అన్నది ఆనవాయితీ. మరి కూటమిలో ఉన్న జనసేన ప్రభుత్వ పక్షం అవుతుంది కానీ ప్రతిపక్షం కాదు కదా అన్న కొత్త చర్చ కూడా ఉంది.

అయితే వైసీపీ తీరుతో పాటు ఏపీ రాజకీయాలు సాగుతున్న విధానం చూసిన వారికి ఇవేమీ పెద్దగా ఆశ్చర్యం పరచేవి కావని అంటున్నారు. సో ఈ పదవిని జనసేనకు ఇచ్చినా వైసీపీ కూడా చేసేది ఏమీ ఉండదని అంటున్నారు. ఇక అసెంబ్లీలో బలాబలాలు బట్టి ఈ పదవిని ఇవ్వాలని అనుకుంటే జనసేనకు 21 సీట్లు ఉన్నాయి కాబట్టి ఇస్తున్నామని చెప్పుకోవచ్చు.

అయితే శాసన మండలి సభ్యులకూ చైర్మన్ పదవి ఇవ్వవచ్చు అని కూడా అంటున్నారు. అలా చూస్తే వైసీపీ మొత్తం బలం ముందే చెప్పుకున్నట్లుగా 40 కి పై దాటుతుంది. కానీ ఈ లెక్కలు ఏవీ రాజకీయ లెక్కల ముందు సరిపోవు కాబట్టి జనసేనకే పీఏసీ పోస్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అలా జరిగితే కనుక చట్ట సభల సంప్రదాయాలను పక్కన పెట్టి ప్రభుత్వంలో ఉన్న పక్షానికి చెందిన వారికి ఈ పదవి ఇవ్వడం తొలిసారి అవుతుంది. సో జనసేనకే ఎక్కువ చాన్స్ ఉందని అంటున్న నేపథ్యంలో ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.