యువ మంత్రుల్లో లోపాలేంటి? చంద్రబాబు ఏమన్నారు?
నాలుగు సార్లు సీఎంగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటే కొత్తగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారు నిర్లక్ష్యంగా ఉండటాన్ని ముఖ్యమంత్రి జీర్ణించుకోలేకపోతున్నారు.
By: Tupaki Desk | 19 Jan 2025 7:30 AM GMTఏపీలో పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం సమీక్షించుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ఉన్నతాధికారుల వ్యవహారశైలిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎవరు ఏమరపాటుగా ఉన్నా అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. నాలుగు సార్లు సీఎంగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటే కొత్తగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారు నిర్లక్ష్యంగా ఉండటాన్ని ముఖ్యమంత్రి జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో తన అసంతృప్తిని వ్యక్తం చేసిన చంద్రబాబు.. పనితీరు మార్చుకోవాలని కొందరు యువ మంత్రులకు హెచ్చరికలు పంపడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఏడు నెలల పాలనపై ప్రజల్లో సంతృప్తిగా ఉన్నా, మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లుగా చెబుతున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో కొందరు మంత్రులు పనితీరు బాగాలేదని, అనుకున్న స్థాయిలో రాణించడం లేదని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా యువ మంత్రులు కొండపల్లి శ్రీనివాసరావు, వాసంశెట్టి సుభాష్ పై ఎప్పటికప్పుడు సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ వారి తీరు మారడం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాష్ర్టంలో మొత్తం 24 మంది మంత్రులు ఉండగా, వీరిలో సీనియర్లు కేవలం ఆరుగురు మాత్రమే. కొత్తగా ఎన్నికైన వారు, తొలిసారి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారే 18 మంది. అయితే వీరిలో ఎక్కువ శాతం మంది అనుకున్న స్థాయిలో రాణించడం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. మంత్రులుగా వారి సొంత జిల్లాలతోపాటు, ఇన్ చార్జిగా వ్యవహారిస్తున్న జిల్లాల్లో ఏ మాత్రం ప్రభావం చూపడం లేదని సీఎం అసంతృప్తిగా ఉన్నారంటున్నారు. స్వయంగా ఐటీ నిపుణుడైన మంత్రి కొండపల్లి కూడా సోషల్ మీడియాను సరైన రీతిలో వాడుకోలేకపోతున్నారని ముఖ్యమంత్రి చెప్పడం చర్చకు దారితీసింది.
విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీకాకుళం జిల్లాకు ఇన్చార్జిగా నియమించారు. ఈ రెండు జిల్లాల్లోనూ గత ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. అయితే మంత్రి కొండపల్లి సొంత జిల్లాలో ఇప్పటికీ వైసీపీ నేత, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. ఆయనను అడ్డుకోవడంలో మంత్రి విఫలమవుతున్నట్లు పార్టీకి నివేదికలు అందాయని చెబుతున్నారు. ఇక ఇన్చార్జిగా ఉన్న శ్రీకాకుళంలో కూడా ఆయన పనితీరుపై కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. అదేవిధంగా విజయనగరం జిల్లాకు ఇన్చార్జిగా ఉన్న హోంమంత్రి అనిత కూడా ఆ జిల్లా వ్యవహారాల్లో పెద్దగా తలదూర్చడం లేదు. దీంతో విజయనగరం జిల్లాలో వైసీపీ సీనియర్ నేత బొత్స ప్రాబల్యం ఎక్కువగా ఉంటోందని ప్రచారం జరుగుతోంది.
ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. ఈయన ఆ జిల్లాలో మిగిలిన నేతలను కలుపుకుని వెళ్లలేదంటున్నారు. గతంలో మంత్రి తీరుపై ముఖ్యమంత్రి నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. సీఎం చీవాట్లు పెట్టిన తర్వాత కూడా మంత్రి తీరులో పెద్దగా మార్పు రాలేదని ఆ జిల్లా నేతలు పార్టీకి నివేదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోపాటు మంత్రి సుభాష్ కీలక బాధ్యతల్లో ఉన్నప్పటికీ ఈ ఇద్దరూ జిల్లా నేతలకు అందుబాటులో ఉండటం లేదని ఆవేదన వ్యక్తమవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ రాష్ట్రస్థాయి వ్యవహారాల్లో బిజీగా ఉండటం వల్ల జిల్లా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత మంత్రి సుభాష్ పై ఉంటోంది. అయితే ఆయన సమర్థంగా వ్యవహరించలేదని కార్యకర్తలు చెబుతున్నారు.
అదేవిధంగా మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టీజీ భరత్, ఎస్.సవిత, సత్యకుమార్ యాదవ్, గుమ్మడి సంధ్యారాణి తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికై మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. గుమ్మడి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె పనితీరుపైనా కార్యకర్తలు సంతృప్తిగా లేరని చెబుతున్నారు. ఇక రాంప్రసాద్ రెడ్డి కీలకమైన రాయలసీమ జిల్లాలో అనుకున్న స్థాయిలో రాణించడం లేదంటున్నారు.
అయితే మంత్రుల సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఒక్క కొండపల్లి పేరు ప్రస్తావించినప్పటికీ మిగిలిన మంత్రుల తీరుపైనా అసంతృప్తిగానే ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి, గెలిచిన వెంటనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమాచార శాఖ మంత్రి పార్థసారధిపై పార్టీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆయన తీరును నిరసిస్తూ సొంత నియోజకవర్గంలోని కార్యకర్తలు రాజీనామాలు చేస్తుండటంతో పార్టీలో హాట్ డిబేట్ జరుగుతోంది. సీనియర్ నేతగా ఆయనను గౌరవిస్తున్న ముఖ్యమంత్రి పరోక్ష హెచ్చరికలు చేసినట్లు చెబుతున్నారు. సీఎం ఆగ్రహాన్ని అర్థం చేసుకుని మంత్రులు పనితీరు మార్చుకోవాల్సివుంటుందని, లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోడానికి సిద్ధంగా ఉండాలని అంటున్నారు.