బెంగళూరుతో కుప్పం పోటీ : చంద్రబాబు
కర్ణాటక రాజధాని నగరం బెంగళూరుతో పోటీపడేలా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
By: Tupaki Desk | 8 Jan 2025 12:30 PM GMTకర్ణాటక రాజధాని నగరం బెంగళూరుతో పోటీపడేలా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం చాలా మంది విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం బెంగళూరు వెళుతున్నారని, అలాంటి వారి గమ్యస్థానం కుప్పం ఉండేలా భవిష్యత్తులో మార్పు తీసుకువస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు.
మూడు రోజులుగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాత్రి జన నాయకుడు అనే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన జన నాయకుడు కార్యక్రమం కోసం కుప్పం నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా జన నాయకుడు పోర్టల్ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించనున్నారు. ఇక ఈ కార్యక్రమంల ప్రసంగించిన సీఎం కుప్పంపై వరాల జల్లు ప్రకటించారు.
2029 నాటికి కుప్పం నియోజకవర్గం ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ప్రస్తుతం నియోజకవర్గం నుంచి యువత విద్య, ఉద్యోగాలకు బెంగళూరును డెస్టినేషన్ గా ఎంపిక చేసుకుంటున్నారని, రాబోయే రోజుల్లో అందరి డెస్టినేషన్ కుప్పంగా ఉండేలా మార్పు తెస్తానని చెప్పారు. పచ్చదనం, చల్లని వాతావరణంతో బెంగళూరులో సగటు జీవితకాలం ఎక్కువ ఉంటుందని, బెంగళూరులో నివసిస్తే ఆయష్షు పెరుగుతుందని చాలా మంది భావిస్తారని చెప్పారు. అదేవిధంగా కుప్పంలో నివసించే వారి ఆయుర్ధాయం కూడా 20 నుంచి 30 ఏళ్లు పెరిగేలా మార్పులు తెస్తానని సీఎం ప్రకటించారు.
కుప్పంలో విద్యా, ఉపాధి రంగాల పురోగతికి విదేశీ విద్యాసంస్థలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. యూనివర్సిటీలు, నైపుణ్య శిక్షణ కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతంగా కుప్పంను మార్చుతానని చంద్రబాబు తెలిపారు కుప్పం నియోజకవర్గం అంటే కడిగిన ముత్యంలా కనిపించాలని, పర్యావరణ పరిశుభ్రత, పునరుత్పాదక ఇంధన వనరులు, సోలార్ విద్యుత్ వంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.