మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన...బాబు కీలక నిర్ణయం
రాష్ట్రంలో ప్రస్తుతం 11వేల 162 గ్రామ సచివాలయాలు అలాగే, 3 వేల 842 వార్డు సచివాలయాలు ఉన్నాయి.
By: Tupaki Desk | 11 Jan 2025 4:00 AM GMTగ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ వైసీపీ హయాంలో 2019 అక్టోబర్ 2 నుంచి ఏర్పాటు అయింది. ఇప్పటికి ఐదున్నరేళ్ల గా పనిచేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 11వేల 162 గ్రామ సచివాలయాలు అలాగే, 3 వేల 842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఈ రెండింటిలో కలుపుకుని లక్షా 27 వేల 175 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
అయితే సచివాలయాలను ఏర్పాటు చేసినపుడు ప్రతి సచివాలయంలో పది మంది ఉద్యోగులు తప్పనిసరిగా ఉండేలా రూపకల్పన చేశారు. కానీ ఆ విధంగా అయితే ఆచరణలో లేదు. కొన్ని చోట్ల కేవలం అయిదారుగురు మాత్రమే ఉంటే మరి కొన్ని చోట్ల పది మంది దాకా ఉన్నారు.
ఇక వర్క్ లేక ఉన్న వారు చాలా చోట్ల ఉంటే వర్క్ లోడ్ పెరిగి అవస్థలు పడుతున్న వారు ఉన్నారు. వీటన్నింటికీ మించి మరో విషయం ఏంటి అంటే సచివాలయాలు మీద ఎవరి అజమాయిషీ ఉండాలి ఏమిటి అన్నది ఒక చర్చగనే ఉంటూ వస్తోంది. పైగా గ్రామీణ ప్రాంతాలలో అయితే పంచాయతీలకు సమాంతర వ్యవస్థగా వైసీపీ హయాంలో ఉంటూ వచ్చింది. ఇక పట్టణాల్లో మున్సిపాలిటీ రెవిన్యూ విభాగాల పనులు కొన్ని వీటికి కేటాయించడంతో ఒక అయోమయం ఏర్పడింది.
ఇపుడు అలాంటివి అన్నీ సరిదిద్దుతూ మార్పుచేర్పులు చేయడానికి టోటల్ గా కీలక మార్పులు చేయడానికి అధికార టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. గ్రామ వార్డు సచివాలయాల మీద సమీక్ష చేసిన చంద్రబాబు వాటిని పూర్తిగా విభజించాలని నిర్ణయించారు. అంతే కాదు మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన చేయాలని డిసైడ్ చేశారు.
ఇక మీదట కనీసం 2500 మంది ప్రజానీకానికి ఒక గ్రామ, వార్డు సచివాలయం ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. వైసీపీ అయితే ప్రతీ వేయి మందికి ఒక సచివాలయం అని డిజైన్ చేసింది. ఇక మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా ఉద్యోగులను విభజించనున్నారు. అలాగే గ్రామాలలో అయితే టెక్నాలజీ ప్రమోషన్‌కు ఆస్పిరేషనల్ సెక్రటరీలు అని కొత్త పోస్టులను క్రియేట్ చేయనున్నారు.
అంతే కాదు ప్రతీ 2500 మంది లోపు జనాభాకు ఇద్దరు మల్టీపర్పస్ ఫంక్షనరీస్ నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలుపుతూ మొత్తంగా ఆరుగురిని సచివాలయంలో సిబ్బందిగా ఉంచుతారు. అదే విధంగా 2500 నుంచి 3500 మంది జనాభాకు ముగ్గురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఏడుగురు సిబ్బందిని ఉంచేలా చూస్తారు.
ఇక 3501 నుంచి ఆపై జనాభాకు నలుగురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి అంటే ఎనిమిది మంది సిబ్బంది ఉంటారని చెబుతున్నారు. ఈ విధంగా రేషనలైజేషన్ చేస్తే కనుక 2500లోపు జనాభా కలిగిన ప్రాంతంలో ఆరుగురు సిబ్బందితో 3,562 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి. 2500 నుంచి 3500 మంది జనాభా కలిగిన ప్రాంతంలో ఏడుగురు సిబ్బందితో 5,388 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి.
3500 పైగా జనాభా కలిగిన ప్రాంతంలో 8 మంది సిబ్బందితో 6054 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయని అంటున్నారు. ఈ విధంగా మొత్తం 15,004 గ్రామ వార్డు సచివాలయాలని రేషనలైజేషన్ విధానంలో ఒక దారిని తెస్తున్నారు. దీని వల్ల పనితీరు మెరుగుపడడమే కాకుండా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని భావిస్తున్నారు.