జూనియర్ కి ఆమెతో చెక్?
రానున్న మరో ఇరవై ఏళ్ల దాకా టీడీపీ నాయకత్వానికి ఎలాంటి సవాళ్లు లేకుండా ఆయన ఇప్పటి నుంచే తగిన వ్యూహాలను రచిస్తున్నారు.
By: Tupaki Desk | 31 Aug 2024 11:44 AM GMTటీడీపీ కూటమిగా ఏపీలో అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత పటిష్టంగా ఉంది. అయితే చంద్రబాబు చూసేది వర్తమానాన్ని కాదు, భవిష్యత్తును. రానున్న మరో ఇరవై ఏళ్ల దాకా టీడీపీ నాయకత్వానికి ఎలాంటి సవాళ్లు లేకుండా ఆయన ఇప్పటి నుంచే తగిన వ్యూహాలను రచిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ భావి వారసుడిగా ఉన్నారు. ఆయనకు పోటీగా వచ్చే వారు ఎవరూ అంటే సమకాలీనుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. జూనియర్ ఈ రోజుకు రాజకీయాల్లోకి రాకపోయినా రేపటి నాడు వచ్చే అవకాశాలు ఉండవచ్చు. అందుకే ఆయన కుటుంబం నుంచి మరొకరిని పోటీకి తెస్తే కచ్చితంగా లెక్క సరిపోతుందని తగిన చెక్ పడుతుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
నందమూరి హరికృష్ణకు జూనియర్ తో పాటు కళ్యాణ్ రామ్, ఏకైక కుమార్తె సుహాసిని ఉన్నారు. జూనియర్ కళ్యాణ్ రామ్ టీడీపీకి దూరంగా ఉంటున్నారు. జూనియర్ అయితే రాజకీయాలతో సంబంధం లేదన్నట్లుగా ఉన్నారు. ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నారు. ఇక కళ్యాణ్ రామ్ కూడా తమ్ముడితోనే ఉంటున్నారు. ఈ ఇద్దరూ కూడా ఒక్కటిగా ఉంటూ వస్తున్నారు.
దీంతో నందమూరి సుహాసినికి చాన్స్ ఇస్తే హరికృష్ణ కుటుంబానికి న్యాయం చేసినట్లు అవుతుందని అంతే కాదు తెలంగాణాలో పార్టీ అభివృద్ధి చెందుతుందని కూడా చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు అని అంటున్నారు. నందమూరి సుహాసినికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని బాబు ఆలోచిస్తున్నారు అన్నది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె చంద్రబాబుకు విధేయురాలిగా ఉంటూ తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు.
ఆమె 2018 ఎన్నికల్లో కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. అయినా పార్టీని విడవకుండా ఉంటున్నారు. దాంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఆమెను రాజ్యసభకు పంపించడం ద్వారా జూనియర్ కి చెక్ పెట్టడంతో పాటు తెలంగాణాలో పార్టీని డెవలప్ చేయవచ్చు అని కూడా బాబు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే నందమూరి కుటుంబంలో బాలయ్య ఒక్కరు మాత్రమే టీడీపీకి సంబంధించి చురుకుగా ఉన్నారు. ఆ తరువాత తరంలో ఎవరూ లేరు. దాంతో సుహాసినిని తీసుకుని రావడం ద్వారా నందమూరి నారా కుటుంబాలు రెండూ ఫ్యూచర్ లో మరింతంగా కలసి ముందుకు సాగేలా టీడీపీ లెగసీని పది కాలాల పాటు కాపాడేలా చూడాలన్నదే బాబు ఆలోచన అని అంటున్నారు.
ఇక వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఇద్దరు రాజీనామాలు చేయడం వల్ల రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీల కోసం ఎంతో మంది ఆశావహులు సిద్ధంగా ఉన్నారు. దాంతో ఈ జాబితా కొండవీటి చాంతాడు మాదిరిగా పెరిగిపోతోంది. ఎవరికి ఇచ్చినా మరొకరికి అది నిరాశగా మారుతుంది. దాంతో తెలివిగా ఆలోచించిన చంద్రబాబు నందమూరి కుటుంబానికి ప్రయారిటీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. మొత్తానికి చూస్తే జూనియర్ ని టార్గెట్ చేసేలా సుహాసినిని ఎంపిక చేశారు అని అంటున్నారు.