మోడీతో బాబు: కొత్త బడ్జెట్ లో భారీ సాయం
కరెక్టుగా ఆరు నెలల కాలం గడచింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.
By: Tupaki Desk | 26 Dec 2024 4:08 AM GMTఏపీ అన్ని విధాలుగా ఇబ్బందులలో ఉంది. కరెక్టుగా ఆరు నెలల కాలం గడచింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇక ఢిల్లీ వెళ్ళేముందు ఏపీలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఎంతో అనుభవం ఉన్న తనకే ఏపీ ఆర్ధిక పరిస్థితి ఏమిటో అసలు అర్ధం కావడం లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ప్రభుత్వం అయిదేళ్ళ పాలన విద్వంశంగా సాగింది. దానిని భర్తీ చేసేందుకు గాడిన పెట్టేందుకు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఇక్కా ఏదీ గాడిన పడడం లేదు అని కూడా అన్నారు. ఏపీలో ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇక రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటన చేసిన చంద్రబాబు ప్రధానంగా ఏపీని ఆదుకోవాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కి విజ్ఞప్తి చేశారు.
ఏపీలో కీలక ప్రాజెక్టులు అన్నీ ఆర్ధికంగా వెసులుబాటు లేక ముందుకు సాగని పరిస్థితిని ఆయన కూలంకషంగా వివరించారు అని అంటున్నారు. అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్ట్ కి 2025-2026 కేంద్ర బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వాలని బాబు కోరారు. దండీగా నిధులు ఇచ్చి ఉదారంగా ఆదుకోవాలని ఆయన పేర్కొన్నారు
అయితే కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్ ని ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతుంది అని అంటున్నారు. ఈ బడ్జెట్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సరైన టైం లోనే చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళారు. తన వెంట కేంద్ర మంత్రులను పార్టీ కీలక నాయకులను ఆయన తీసుకుని వెళ్ళారు. బడ్జెట్ లో ఏ రంగానికి ఎంత ఇవ్వాలన్న దాని మీద ఆయన వివిధ శాఖల మంత్రులతో కలసి కోరారని చెబుతున్నారు
మరి కేంద్ర ప్రభుత్వం బాబు విన్నపాలను ఆలకించి తగిన విధంగా ఏపీకి న్యాయం చేస్తుందా అన్నది చర్చగా ఉంది. ఎందుచేతనంటే 2025 అక్టోబర్ లో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. అలాగే ఢిల్లీ అసెంబ్లీకి కొత్త ఏడాది ప్రధమార్ధంలో ఎన్నికలు ఉన్నాయి. దాంతో కేంద్రం సహజంగానే ఆయా రాష్ట్రాలకు పెద్ద పీట వేస్తుంది అని అంటున్నారు.
అదే సమయంలో ఎన్డీయేలో రెండవ పెద్ద పార్టీగా ఉన్న టీడీపీకి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని అంటున్నారు. కానీ ప్రపంచ బ్యాంక్ రుణంగా ఇచ్చే నిధులకు కేంద్రం పూచీకత్తుగా ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి పాత బకాయిలను రిలీజ్ చేసింది. అవసరం అయితే మరిన్ని నిధులను వచ్చే బడ్జెట్ లో కేటాయించవచ్చు. అమరావతికి కొత్తగా కేంద్ర సాయంగా నిధులు ఇస్తుందా అన్నది అయితే చూడాల్సి ఉంది అదే కనుక జరిగితే చంద్రబాబు ఢిల్లీ పర్యటన విజయవంతం అయినట్లే అని అంటున్నారు.
ఏపీలో బీజేపీ మంత్రి ప్రభుత్వం లో ఉన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ మంత్రులు ఉన్నారు. మిత్రులుగా అంతా ఎన్డీయేలో కొనసాగుతున్నారు. దానికి తోడు విభజన హామీలు ఉండనే ఉన్నాయి. అందువల్ల కేంద్రం చొరవ తీసుకుని ఏపీకి ఎక్కువగా నిధులను బడ్జెట్ లో కేటాయించడం అవసరం అని అంటున్నారు. చంద్రబాబు అయితే కేంద్రం మీద ఏ రకమైన రాజకీయ ఒత్తిడులూ పెట్టడం లేదు. ఏపీ అభివృద్ధి కోసమే ఆయన నిధులను అడుగుతున్నారు. మరి కేంద్రం కూడా ఉదారంగా నిధులను ఇచ్చే విషయం ఆలోచించాలని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.