‘గుండెపోటు’ రోగులకు బాబు అభయం
ఏపీలో గుండెపోటు రోగులకు అత్యావసర వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Desk | 7 Feb 2025 9:26 PM ISTఏపీలో గుండెపోటు రోగులకు అత్యావసర వైద్యం అందించే విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో పెరిగిపోతున్న గుండెపోటు మరణాలను నివారించేందుకు అత్యావసర వైద్యం ముఖ్యమని ప్రభుత్వం గుర్తించింది. గుండెపోటు బాధితులను రక్షించే టెనెక్టెప్లేస్ ఇంజక్షన్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. గుండెపోటు వచ్చిన గంట వ్యవధిలో ఈ ఇంజక్షన్ ఇస్తే బాధితుడిని ప్రాణాపాయం నుంచి తప్పించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఖరీదైన ఈ ఇంజక్షన్ సకాలంలో వేయించుకోలేక పేదలు, మధ్య తరగతి వారు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆ ఖర్చు ప్రభుత్వమే భరించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల గుండె పోటు బాధితుల ఆరోగ్యానికి సర్కారు భరోసా ఇచ్చినట్లైంది.
ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు బాగా ఎక్కువయ్యాయి. కరోనా వచ్చిన తర్వాత ఈ సమస్య దాదాపు రెండింతలు అయింది. ఒత్తిడి, స్థూలకాయం వంటి పలురకాల సమస్యలు వల్ల చాలా మందికి గుండెపోటు వస్తోంది. వయసుతో సంబంధం లేకుండా యుక్తవయసు వారు గుండెపోటుకు గురై ప్రాణాలు విడుస్తున్నారు. ఈ పరిస్థితులపై ఈ మధ్య చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం అందించే వెసులుబాటు ఉన్నా, రోగి అడ్మిట్ అయిన తర్వాత ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి అనుమతి వచ్చేవరకు ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల అత్యావసర సమయాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ప్రభుత్వానికి నివేదికలు అందాయి. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు టెనెక్టెప్లేస్ ఇంజక్షన్లను తక్షణం వేయాలని వైద్యులకు సూచిస్తూ ఆదేశాలిచ్చింది. జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెనెక్టెప్లేస్ ఇంజక్షన్ అందుబాటులో ఉండేలా చూడాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఇంజక్షన్ ఖరీదు ఒక్కొక్కటి రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు ఉంటుంది. అంత డబ్బు పెట్టి కొనుగోలు చేయలేని పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల పేద గుండెకు ఆసరా దక్కినట్లైంది.
అయితే ఖరీదైన టెనెక్టెప్లేస్ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచడమే ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా చెబుతున్నారు. ప్రస్తుతం టెనెక్టెప్లేస్ ఇంజక్షన్లు కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే లభిస్తున్నాయి. గుండెపోటు వచ్చిన గంటలోనే ఈ ఇంజక్షన్ ఇవ్వాల్సివుంటుంది. కార్పొరేట్ ఆస్పత్రులకు సుదూర ప్రాంతాల్లో ఉండే వారు సమయానికి ఆస్పత్రికి రావడం, ఇంజక్షన్ చేసుకోవడం కూడా కుదరడం లేదు. దీనివల్ల డబ్బు ఉన్నా, ఇంజక్షన్ సయయానికి వేసుకోలేక కొందరు ప్రాణాలు విడుస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలోనూ టెనెక్టెప్లేస్ ఇంజక్షన్లు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు వస్తున్నాయి. మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఈ అత్యావసర సంజీవని నిల్వ ఉంటే ప్రాణాపాయం నుంచి గుండెపోటు బాధితులను రక్షించవచ్చని అంటున్నారు.