Begin typing your search above and press return to search.

తొక్కిసలాటపై బాబు.. పవన్ రియాక్షన్లలో తేడా ఉందా?

ఒక విషాద ఘటనపై అధికార.. విపక్ష నేతల ప్రకటనలు.. ప్రతిస్పందనలు వేర్వేరుగా ఉండటం సహజం.

By:  Tupaki Desk   |   10 Jan 2025 6:50 AM GMT
తొక్కిసలాటపై బాబు.. పవన్ రియాక్షన్లలో తేడా ఉందా?
X

ఒక విషాద ఘటనపై అధికార.. విపక్ష నేతల ప్రకటనలు.. ప్రతిస్పందనలు వేర్వేరుగా ఉండటం సహజం. అయితే.. ఏపీలో తాజాగా చోటు చేసుకున్న తిరుపతి తొక్కిసలాట విషాద ఘటనపై అధికార కూటమికి చెందిన ఇద్దరు ప్రముఖుల రియాక్ష్ భిన్నంగా ఉండటమే కాదు.. ఒకే విషయాన్ని వారిద్దరూ ఎలా చూస్తారన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. వారిద్దరిలోని భిన్నకోణాల్ని ఆవిష్కరించటం ఆసక్తికరంగా మారింది.

తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందనలు చూద్దాం. ఆయన చేసిన వ్యాఖ్యల్లోని కీలక అంశాల్ని.. నిర్ణయాల్ని చూస్తే..

- తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యల ప్రకటన

- డీఎస్పీ రమణ కుమార్ బాధ్యత లేకుండా పని చేశారు.

- నిర్లక్ష్యంగా వ్యవహరించిన రమణ కుమార్.. గోశాల డైరెక్టర్ హరనాథ్ రెడ్డిని సస్పెండ్ చేశాం.

- ఎస్పీ సుబ్బరాయుడు.. జేఈవో గౌతమి.. సీఎస్ వో శ్రీధర్ ను తక్షణమే బదిలీ చేస్తున్నాం.

- ఘటనపై న్యాయ విచారణ జరిపిస్తాం.

- టీటీడీ ద్వారా మరణించిన కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం

- మరణించిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగమిస్తాం.

- తీవ్ర గాయాలైన తిమ్మక్క.. ఈశ్వరమ్మకు రూ.5 లక్షల చొప్పున సాయం

- గాయపడిన ప్రతి ఒక్కరికి రూ.2 లక్షలచొప్పున పరిహారం

- బాధలో ఉన్నప్పటికి స్వామి వారి దర్శనం చేసుకోవాలనుకునే సంకల్పం వారిలో ఉంది.. 35 మందికి శుక్రవారం వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తాం.

- తిరుమల దివ్యక్షేత్రం పవిత్రత కాపాడే బాధ్యత తీసుకుంటా.

- రాజకీయాలకు అతీతంగా కలియుగ దేవుడికి సేవ చేస్తున్నామనే భావనతో ముందుకు పోవాలి.

- తిరుమల కొండపై స్వామి వారిని తలుచుకుంటూ 36 గంటలైనా క్యూలైన్ లో దైవ చింతనతో ఉంటాం కానీ తిరుపతిలో అంత టైం వేచి ఉండటం ఇబ్బందిగా ఉందని భక్తులు చెబుతున్నారు.

- తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్లు ఇవ్వటం గతంలో లేని సంప్రదాయం.

- వైకుంఠ ద్వార దర్శనాన్ని పది రోజులకు పెంచారు. ఎందుకు పెంచారో తెలీదు.

- మొదట్నించి ఉన్న సంప్రదాయాన్ని మార్చటం మంచిది కాదు.

- ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పద్ధతులు ఉండాలి.

- పవిత్ర దినాల్లో దర్శనాలు సాఫీగా చేయించాల్సిన బాధ్యత అధికారులదే.


ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుపతి తొక్కిసలాట ఉదంతంపై స్పందించారు. బాధితుల్ని పరామర్శించిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యల్లోని కీలక అంశాల్ని చూస్తే..

- తొక్కిసలాట ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నా.

- తప్పు జరిగింది. బాధ్యత తీసుకుంటాం.

- క్షతగాత్రులు.. రాష్ట్ర ప్రజలు.. వేంకటేశ్వరస్వామి భక్తులు.. హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరినీ క్షమించమని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతోంది.

- ఈ ఘటన జరగకుండా ఉండాల్సింది.

- క్రౌడ్ మేనేజ్ మెంట్ సరిగా లేదని భక్తులు చెబుతున్నారు.

- టీటీడీ సిబ్బంది.. పోలీసులు ఉండి కూడా ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరం.

- వీఐపీలపై కాదు.. సామాన్యులపై టీటీడీ ఫోకస్ పెట్టాలి.

- మరణించిన కుటుంబాల వద్దకు టీటీడీ సభ్యులు వెళ్లి క్షమాపణలు చెప్పాలి.

- తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఈవో.. ఏఈవో బాధ్యత తీసుకోవాలి.

- ఘటనా స్థలిలో ఉన్న పోలీసులు బాధ్యత తీసుకోవాలి.

- అధికారులు చేసిన తప్పులకు మేం తిట్లు తింటున్నాం.

- తొక్కిసలాట జరిగితే సహాయక చర్యలు ఎలా ఉండాలనే ప్రణాళిక లేదు.

- వ్యక్తులు చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్నాయి.

- భవిష్యత్తులోదుర్ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.

- పోలీసుల్లో కొందరు కావాలని చేశారా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

- ఈ అనుమానాలపై విచారణ జరగాల్సి ఉంది.

- ఇంత మంది పోలీసు అధికారులున్నా తప్పు ఎందుకు జరిగింది?

- పోలీసు శాఖ నిర్లక్ష్యంపై సీఎం.. డీజీపీ ద్రష్టికి తీసుకెళ్తా.

- తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం 8-9 గంటలు వెయిట్ చేసే పరిస్థితి మారాలు. సాధ్యమైతే ఒకట్రెండు గంటల్లో దర్శనం జరిగేలా చూడాలి.


ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మాట్లాడిన మాటల్నిచదివిన తర్వాత ఏమనిపించింది? ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల్లో నష్ట పరిహారం.. బాధ్యులపై చర్యలతో పాటు.. ప్రభుత్వం మీద పడిన నిందను తుడిచే ప్రయత్నం చేయటం కనిపిస్తుంది. అదే సమయంలో పవన్ వ్యాఖ్యల్ని చూస్తే.. భావోద్వేగంతో మాట్లాడినట్లుగా.. సామాన్యుడికి సైతం ప్రభుత్వం ఎంత వేదన చెందుతుందో అన్న విషయాన్ని తెలియజేయాలన్నట్లుగా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల్లో జరిగిన డ్యామేజ్ ను వీలైనంతగా తగ్గించేందుకు ఏం చేస్తే బాగుంటుందన్న ఆత్రుత కనిపిస్తే.. ఉప ముఖ్యమంత్రి పవన్ మాటల్లో.. జరిగిన విషాదంపై వేదనతో పాటు.. అధికారుల నిర్లక్ష్యం.. అలక్ష్యంతో పాటు.. ప్రణాళిక లోపాల్ని ఎత్తి చూపటం కనిపిస్తుంది.

చంద్రబాబు మాటల్లో ఆయన లేవనెత్తిన అంశాల్లో కొన్ని మాటల్ని చదివిన తర్వాత.. ఆయనపై ఎదురుదాడి చేసేందుకు.. విమర్శనాస్త్రాల్ని సంధించే అవకాశం ఇవ్వటం కనిపిస్తుంది. వైకుంఠ ఏకాదశి టోకెన్లు తిరుపతిలో ఇవ్వటం ఏమిటి? పది రోజులకు పెంచటం ఏమిటి? లాంటి ప్రశ్నలు వేయటం ద్వారా.. గత ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేశారని చెప్పాలి. అదే సమయంలో.. మరి మీరిప్పుడు అధికారంలో ఉన్నారు.. వాటిని ఎందుకు మార్చలేదన్న విమర్శను కొనితెచ్చుకునేలా మాటలు ఉన్నాయని చెప్పాలి.

అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ మాటల్ని చదివినప్పుడు.. తన మాటల ద్వారా విమర్శల్ని ఎదుర్కొనే అవకాశం ఇవ్వకుండా ఉండటం కనిపిస్తుంది. అదే సమయంలో.. తొక్కిసలాట వెనుక కుట్ర కోణం ఉందన్న కొత్త సందేహాన్ని వ్యక్తం చేయటం ద్వారా.. కొత్త తరహా చర్చకు తెర తీశారని చెప్పాలి. ఏపీ ప్రభుత్వాన్నినడిపే ఇద్దరి అధినేతల మాటల్లో తేడా ఎంతన్న విషయం తాజా ఉదంతం చెప్పకనే చెప్పేస్తుందని చెప్పాలి.