భారీ పెట్టుబడులతో ఏపీ డెవలప్మెంట్ ను రీస్టార్ట్ చేసిన చంద్రబాబు
ఈ క్రమంలోనే ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత ఏపీ డెవలప్మెంట్ రీస్టార్ట్ అయింది.
By: Tupaki Desk | 20 Nov 2024 9:35 AM GMTజగన్ హయాంలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కు వెళ్లిందని, పథకాలకు డబ్బులు పంచడం తప్ప రాష్ట్రాభివృద్ధిని జగన్ పట్టించుకోలేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించడం తెలిసిందే. ఏపీకి రావాల్సిన సంస్థలు, పరిశ్రమలు, పెట్టుబడులు వెనక్కు వెళ్లడంతో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలింది. జగన్ దెబ్బకు కంప్యూటర్ హ్యాంగ్ అయిన మాదిరి ఏపీ డెవలప్మెంట్ హ్యాంగ్ అయింది. ఈ క్రమంలోనే ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత ఏపీ డెవలప్మెంట్ రీస్టార్ట్ అయింది.
ఇప్పటికే అమరావతితోపాటు రాష్ట్రానికి పలు సంస్థలు, పరిశ్రమలు, పెట్టుబడులు తేవడంలో ఓ పక్క సీఎం చంద్రబాబు, మరోపక్క మంత్రి లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోపే పరిశ్రమలు, ఇంధన రంగాలకు సంబంధించిన 11 భారీ పరిశ్రమలు ఏపీకి తరలివచ్చాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్ ఐపీబీ)తొలి సమావేశంలో ఆ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం లభించింది.
వీటి ద్వారా ఏపీకి రూ.85,083 కోట్ల పెట్టుబడులు, 33,966 మందికి ఉపాధి లభించనుంది. కొత్త పారిశ్రామిక పాలసీల ప్రకారం, యువతకు ఇచ్చే ఉద్యోగాల సంఖ్య ప్రకారం ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించాలని ఆ సమావేశంలో నిర్ణయించారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారిని గౌరవిద్దామని సీఎం చంద్రబాబు ఆ సమావేశంలో చెప్పారు.
పక్క రాష్ట్రాలతో పోటీని తట్టుకుని ఏపీకి పెట్టుబడులు తెచ్చే విధంగా అధికారులు పనిచేయాలని, పెట్టుబడిదారులకు సహకరించాలని సూచించారు. అమరావతి భూసమీకరణ మాదిరి భారీ పరిశ్రమలకు మూడు పద్ధతుల్లో భూసేకరణ చేపట్టాలని, ఆ విధానాన్ని ప్రజల ముందుంచాలని చెప్పారు.
రెండో ఆప్షన్ కింద భూములిచ్చే వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆ ప్రాజెక్టులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాని అన్నారు. లేదంటే అత్యుత్తమ ప్యాకేజీ కింద భూసేకరణ చేపట్టాలని చెప్పారు. పెట్టుబడులతో పాటు భూములు కోల్పోయే ప్రజల భవిష్యత్ కూడా అంతే ముఖ్యం అని చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఆమోదం తెలిపిన పలు సంస్థలు ఇవే...
1. ఆర్సెలార్ మిత్తల్, నిప్పన్ స్టీల్స్‌తో కలిసి అనకాపల్లి జిల్లా బంగారయ్యపేట దగ్గర ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, దానికి అనుబంధంగా కో-టెర్మినస్ క్యాప్టివ్ పోర్ట్ అభివృద్ధి. రూ.61,780 కోట్ల పెట్టుబడులు, దాదాపు 21 వేల మందికి ఉపాధి
2. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర దగ్గర భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టం లిమిటెడ్ (కేఎస్ఎస్ఎల్) రక్షణ రంగానికి అవసరమైన ఫిరంగులు, మందుగుండు సామగ్రి తయారీ పరిశ్రమ ఏర్పాటు. మొదటి దశలో రూ.1,430 కోట్ల పెట్టుబడి, 565 మందికి ఉపాధి.
3. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్...రూ.5001 కోట్ల పెట్టుబడి, 1495 మందికి ఉపాధి
4. ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ రూ. 3,798 కోట్ల పెట్టుబడులు, 200 మందికి ఉపాధి
5. ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ రూ.1,046 కోట్ల పెట్టుబడులు, 2,381 మందికి ఉపాధి
6. ట్రాక్టర్ల తయారీ రంగంలో ప్రముఖ సంస్థ టాఫే ఫరేషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ. 76 కోట్లు పెట్టుబడులు, 250 మందికి ఉపాధి
7. డల్లాస్ టెక్నాలజీ సెంటర్ ఎల్ఎల్‌పీ రూ. 50 కోట్ల పెట్టుబడులు, 2 వేల మందికి ఉపాధి
9. ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా రూ.8,240 కోట్ల పెట్టుబడి, 4 వేల మందికి ఉపాధి
వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల పరిధిలో 1,800 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టు (పీఎస్‌పీ) ఏర్పాటు
10. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2 వేల కోట్ల పెట్టుబడులు, 500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు, 1,725 మందికి ఉపాధి
11. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,662 కోట్ల పెట్టుబడులు, 277 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు, 350 మందికి ఉపాధి