35 మందికి నేరుగా వైకుంఠ ద్వార దర్శనం: చంద్రబాబు
ఇక, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు.
By: Tupaki Desk | 10 Jan 2025 3:57 AM GMTతిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన వారితోపాటు స్వల్పంగా గాయపడిన మొత్తం 35 మందికి శుక్రవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి దర్శనం కల్పించనున్నట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. అదేవిధంగా తీవ్రంగా గాయపడిన ఇద్దరికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడి న వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం తక్షణం చేయనున్నట్టు చెప్పారు. ఇక, మృతుల కుటుంబాల కు రూ.25 లక్షలచొ ప్పున విడుదల చేయనున్నట్టు తెలిపారు.
ఇక, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. వీరిలో డీఎస్పీ రమణ కుమార్ ఉన్నారు. అదేవిధంగా గోశాల డైరెక్టర్ ఉన్నారు. అలాగే, ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో సహా మరికొందరు అధికారులను తక్షణమే బదిలీ చేశారు. తిరుమల పవిత్రతను కాపాడతామని సీఎం చంద్రబా బు చెప్పారు. తిరుమల శ్రీవారి భక్తుడిగా ఈ ఘటన తనను ఎంతో కలచి వేసిందన్నారు. అయినప్పటికీ.. ఇకపై జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.
ఈ తొక్కిసలాట ఘటనపై మంత్రులతో కమిటీ వేశామని.. విచారణ చేస్తుందన్నారు. అనంతరం.. తగిన విధంగా బాధ్యులపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. ''మన అసమర్థత కారణంగా దేవదేవుడికి చెడ్డపేరు తీసుకురావడాన్ని నేను క్షమించను'' అని స్పష్టం చేశారు. పవిత్ర దినాల్లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేయడం నుంచి వారికి సరైన రీతిలో శ్రీవారి దర్శనం లభించేలా చేసే బాధ్యత కూడా టీటీడీ అధికారులపై ఉంటుందని సీఎం తెలిపారు.
వైసీపీపై పరోక్ష విమర్శలు..
వైకుంఠ ఏకాదశి నాడు 10 రోజుల పాటు దర్శనాలు కల్పించే కొత్త సంప్రదాయానికి తెరదీశారని, ఇది ఆగమ శాస్త్ర నియమాలకు విరుద్ధమని పండితులు చెబుతున్నారని సీఎం చెప్పారు. కేవలం తిధి ఉన్న రోజుల్లోనే ఈ దర్శనం కొనసాగుతుందన్నారు. అదేవిధంగా టోకెన్లు ఇచ్చే సంస్కృతి కూడా ఎప్పుడూలేదని తెలిపారు. ఇవన్నీ.. శ్రీవారి ఆగ్రహానికి కారణమై ఉంటాయని కొందరు చెబుతున్నట్టు వ్యాఖ్యానించారు.