Begin typing your search above and press return to search.

ప్రజలు అధికారం ఇస్తే.. సంప్రదాయాలు బ్రేక్ చేస్తారా..? జగన్‌పై చంద్రబాబు సంచలన ట్వీట్

మరోవైపు.. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్ష కూడా తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   24 Sep 2024 10:35 AM GMT
ప్రజలు అధికారం ఇస్తే.. సంప్రదాయాలు బ్రేక్ చేస్తారా..? జగన్‌పై చంద్రబాబు సంచలన ట్వీట్
X

తిరుమల లడ్డూ తయారీలో జంతవుల కొవ్వు వినియోగించారని వెలుగుచూసిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనమైంది. దేశంలోనే కాకుండా ఇదర దేశాల్లో ఉన్న భక్తులంతా ఒకింత ఆవేదనకు గురయ్యారు. ఇందుకు గత వైసీపీ ప్రభుత్వమే కారణమంటూ ప్రభుత్వం పెద్దలు ఆరోపిస్తుండగా.. వైసీపీ కూడా దానిపై ఎదురుదాడికి దిగింది. అప్పటి నుంచి వైసీపీ నేతలు, కూటమి నేతల మధ్య మాటలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు.. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్ష కూడా తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

ఇప్పటికే జగన్‌పై ఈ అంశంపై చంద్రబాబు నాయుడు చాలా సీరియస్‌గా ఉన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీశారని, భక్తుల మనోభావాలను దెబ్బతీశారని సీరియస్ అయ్యారు. తాజాగా ఆయన చేసిన ‘X’ వేదికగా వైసీపీ అధినేత జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. జగన్ ముందు ఆయన పెద్ద డిమాండ్ పెట్టారు. వేంకటేశ్వర స్వామి అంటే నమ్మకం ఉంటే.. అన్యమతస్తుల సంప్రదాయం ప్రకారం తిరుమలలో డిక్టరేషన్ ఇవ్వాలని, కానీ సీఎం హోదాలో జగన్ మిస్ యూజ్ చేశారని పేర్కొన్నారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండానే తిరుమలకు వెళ్లారని తెలిపారు. సంప్రదాయాన్ని గౌరవించకపోతే తిరుమలకు ఎందుకు వెళ్లాలి అని నిలదీశారు. ప్రజలు అధికారం కట్టబెట్టినందుకు ఇలా సంప్రదాయాలను బ్రేక్ చేయడమా అని ప్రశ్నించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా సీఎం హోదాలో జగన్ పట్టువస్త్రాలు సమర్పించిన సమయంలోనూ ఆయన డిక్లరేషన్ ఇవ్వలేదని గుర్తుచేశారు.

గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పలు ఘటనలూ ఆయన ప్రస్తావించారు. తిరుమలలో లడ్డూ పోటులో అగ్ని ప్రమాదం జరిగితే.. ఇప్పుడు ఏమైందంటూ వైసీపీ నేతలు అన్నారని తెలిపారు. అలాగే.. రథం కాలిపోతే తేనెటీగలు వచ్చి రథాన్ని కాల్చేశాయని ప్రజలను తప్పుదోవ పట్టించారని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో ఇలా చాలా ఘటనలపై నిర్లక్ష్యంగా వ్యవహరించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా జగన్ సైలెంటుగా ఉండిపోయారని, భక్తుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు. జగన్ ఇప్పటికీ తిరుమల శ్రీవారిని దర్శించుకోవచ్చని, కానీ ఆయనకు వేంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉన్నదా లేదా అనేది కూడా ముఖ్యమని పేర్కొన్నారు.

ఇటు తిరుమల లడ్డూ ఉదంతంపై తెలుగు రాష్ట్రాల్లో ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలయాన్ని శుద్ధి చేశారు. మరోవైపు.. లడ్డూ ప్రసాదం కల్తీని నిరసిస్తూ ఏపీ, తెలంగాణ సాధు పరిషత్ ఆధ్వర్యంలో స్వామిజీలు తిరుమలలో ఆందోళను దిగారు. తితిదే పరిపాలన భవనం ఎదుట నిరసనకు దిగారు. ‘సేవ్ తిరుమల.. సేవ్ తితిదే’ అంటూ నినాదాలు చేశారు. ఆలయాల్లో అన్యమతస్తులను ఉద్యోగులుగా నియమించవద్దని డిమాండ్ చేశారు. గత పాలకమండలి చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అప్పటి ఈవోలు జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి తదితరులపై చర్యలు తీసుకోవాలని ఈ ధర్నా చేపట్టారు.