మీరు వస్తున్నారనే క్లీన్ చేశారు.. చంద్రబాబుకు షాకిచ్చిన బాలిక
ముఖ్యమంత్రి ఎదుటే తమను బాలిక బుక్ చేయడంతో అధికారులు దిక్కులు చూడాల్సివచ్చింది.
By: Tupaki Desk | 16 Feb 2025 8:03 AM GMTస్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ బాలిక షాక్ ఇచ్చింది. నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించిన సీఎం చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది. రాష్ట్రాన్ని క్లీన్ గా ఉంచాలని కోరుకుంటున్న చంద్రబాబుకు క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కళ్లకు కట్టేలా ఓ బాలిక వివరించింది. ముఖ్యమంత్రి గారూ మీరు వచ్చారనే.. ఈ రోజు ఊర్లో శుభ్రం చేశారు. లేదంటే రోడ్లన్నీ పెంటకుప్పలుగానే వదిలేస్తున్నారని బాలిక చెప్పడంతో అధికారులు నీళ్లు నమిలారు. ముఖ్యమంత్రి ఎదుటే తమను బాలిక బుక్ చేయడంతో అధికారులు దిక్కులు చూడాల్సివచ్చింది.
పచ్చదనం-పరిశ్రుభతకు అధిక ప్రాధాన్యమిచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుటే ఓ బాలిక సభా వేదికపైనే అధికారుల తీరుపై విమర్శలు చేయడంతో అంతా కంగుతిన్నారు. సీఎం వస్తేనే హడావిడి చేస్తారని, లేదంటే అస్సలు పట్టించుకోరని చెప్పడంతో సీఎం కూడా ఓకింత సంతృప్తి వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్సులు, ఇతర సమీక్ష సమావేశాల్లో క్లీన్ ఆంధ్ర కార్యక్రమంపై ముఖ్యమంత్రి పదేపదే సూచనలు చేస్తుంటారు. అయితే సీఎం ఎన్నిసార్లు ఎలా చెప్పినా క్షేత్రస్థాయిలో అధికారులు గాలికి వదిలేస్తున్నారనే విషయాన్ని బాలిక తెలియజేయడంతో తన ఆదేశాలు కూడా పాటించడం లేదని చంద్రబాబుకు అర్థమైంది.
కందుకూరులో పర్యటించిన చంద్రబాబు ముందుగా పట్టణంలో పరిశుభ్రత కార్యక్రమాలపై ఫొటో ప్రదర్శన తిలకించారు. అనంతరం పట్టణంలో పలు ప్రాంతాల్లో కలియదిరిగారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించారు. పరిశుభ్రత ఆవశ్యతను సీఎం వివరిస్తుండగా, ఓ బాలికను మాట్లాడేందుకు ఆహ్వానించారు. అయితే ఆమె అనూహ్యంగా అధికారులు సరిగా పనిచేయడం లేదని, సీఎం వచ్చారు కాబట్టి పట్టణంలో శుభ్రం చేశారని చెప్పారు. మీరు, ఇతర పెద్ద నాయకులు రాకపోతే రోడ్లు ఇంత అందంగా ఉండవని ఫిర్యాదు చేశారు. దీంతో సీఎంతో సహా అంతా కంగుతిన్నారు.