ఓపెన్ అయిపోతున్న బాబుకి కోపరేషన్ కావాలి !
ఎలా అంటే ఒక రాజకీయ నాయకుడిగా. రాజకీయాల్లో వ్యూహాలే ఉంటాయి కానీ వేరేవీ ఉండవు.
By: Tupaki Desk | 16 Feb 2025 3:57 AM GMTటీడీపీ అధినేత హోదాలో చంద్రబాబు ఎన్నికల ముందు చాలానే చెప్పారు. ఆనాటికి ఆయన చెప్పినది కరెక్ట్. ఎలా అంటే ఒక రాజకీయ నాయకుడిగా. రాజకీయాల్లో వ్యూహాలే ఉంటాయి కానీ వేరేవీ ఉండవు. ప్రత్యర్ధి మీద గెలిచామా లేదా అన్నదే అక్కడ పాయింట్. పై చేయి సాధించేందుకు ఏమైనా చేయవచ్చు ఎందాకైనా పోవచ్చు అన్నది చాణక్య నీతి. దానిని చంద్రబాబు ఒక రాజకీయ పార్టీ అధినేతగా అమలు చేశారు.
వైసీపీని ఓడించాలంటే సామ దాన భేద దండోపాయాలు అన్నీ ఆయన వాడారు. ఇక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైసీపీ మీద జనాలలో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది. అందుకే వారిని తమ వైపు తిప్పుకునేందుకు రెట్టింపు పధకాలు ఇస్తామని బాబు చెప్పాల్సి వచ్చింది. లేకపోతే ఏమి జరిగి ఉండేదో అన్నది ఊహాతీతం. ఇదిలా ఉంటే బాబు సూపర్ సిక్స్ అని చెప్పినా లేక మరిన్ని హామీలు ఇచ్చినా అన్నీ కూడా రాజకీయ నేతగా అధికారం కోసం చేసినవే అని అనుకోవాల్సి ఉంటుంది.
ఇక ఇపుడు అధికారం చేతిలోకి వచ్చింది. ప్రభుత్వాధినేతగా బాబు ఉన్నారు. ఆయన తనకు ఇన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలియవని అంటున్నారు వైసీపీ అయిదేళ్ళ పాటు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని దాని ఫలితం ఇపుడు రాష్ట్రంలో ఖజానా దివాళా తీసిందని బాబు అంటున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు మళ్ళీ అప్పులు చేస్తున్నామని ఆయన ఏపీ ఆర్ధిక పరిస్థితిని విడమరచి చెబుతున్నారు.
తనకు ప్రజల కోసం ఎంతో చేయాలని ఉందని అంటున్నారు. అయితే ఖజానా ఖాళీగా ఉండి వెక్కిరిస్తోంది అని ఆయన వాపోతున్నారు. ఇక అప్పుల మీద అప్పులు తెచ్చినట్లు అయితేనే సంక్షేమ పధకాలు అమలు చేయగమలని కూడా ఆయన కుండబద్ధలు కొట్టేశారు. అలా చేయడం కూడా కష్టమే అని అన్నారు.
ఇవన్నీ కూడా ఆయన నేరుగా సభలలోనే చెబుతున్నారు. మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు. నిండు శాసన సభలో చెబుతున్నారు ఆయన శ్వేతపత్రాలను రిలీజ్ చేసి మరీ చెబుతున్నారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చెబుతున్నారు. ఎందుకు ఇదంతా అంటే తాను చెబుతున్న దానిని గుర్తించి ప్రజలు కోపరేట్ చేయాలని ఆయన కోరుతున్నారు.
వైసీపీ అయిదేళ్ళ పాలనలో సంపద సృష్టి అన్నది జరగలేదని కేవలం అప్పులు చేయడమే వారు పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. ఆ పనిని కూటమి ప్రభుత్వం చేస్తోందని ఫలితాలు కూడా వస్తాయని ఆయన అంటునారు. అలా సంపద సృష్టి జరిగి ఏపీకి ఆదాయం వస్తే తప్పకుండా పధకాలు ఇస్తామని ఆయన అంటున్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో చెబుతున్నది ఏంటి అంటే పధకాలు ఇవ్వాలని ఉంది, కానీ ఇపుడు ఇవ్వలేని పరిస్థితి, ఆదాయం పెరిగితే ఇస్తామని. మరి ఈ విషయంలో ప్రజలకు అర్ధమయ్యే భాషలోనే ఆయన మాట్లాడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇదే చెబుతున్నారు.
ఒకవేళ అప్పులు చేసి ఇవ్వాలని చూసినా అప్పులు కూడా పుట్టని పరిస్థితి ఉందని అంటున్నారు. ఇలా బాబు చెబుతున్న దానిని ప్రజలు అర్ధం చేసుకుని సహకరిస్తేనే మంచి రోజులు ఏపీకి వస్తాయన్నది ఆయన ఆలోచనగా ఉంది. అయితే ప్రజలు ఈ విషయంలో సహకరిస్తారా అన్నది చూడాలి. ఒక్క సంక్షేమ పధకాలనే ఇస్తూ నమ్ముకున్న పాలకులను ఇటీవల ప్రజలు ఓడించారు.
అలాగే దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఉచితాల మీద విమర్శలు చేసింది. ఇవన్నీ ఒక వైపు ఉన్నాయి. ప్రజల ఆలోచనలు మారేందుకు కూడా ఇలాంటివి ఎంతో కొంత ఆస్కారం కలిగిస్తాయి. కానీ ఏపీలో కొన్ని వర్గాలలో చూస్తే కనుక అలా లేదు అని అంటున్నారు. పధకాల మీద ఆధారపడిన వారు అలవాటు పడిన వారు మాత్రం ఎంతవరకూ సహకారం అందిస్తారు అన్నదే చర్చగా ఉంది.