స్ట్రాంగ్ వాయిస్ తో స్మూత్ వార్నింగ్... డెడ్ లైన్ ఫిక్స్ చేసిన బాబు!
ఈ సందర్భంగా డెడ్ లైన్ ఫిక్స్ చేస్తూ.. స్ట్రాంగ్ వాయిస్ తో స్మూత్ వార్నింగ్ ఇచ్చారు.
By: Tupaki Desk | 15 March 2025 3:02 PM ISTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన "స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంద్ర" కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా.. అధికారులు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డెడ్ లైన్ ఫిక్స్ చేస్తూ.. స్ట్రాంగ్ వాయిస్ తో స్మూత్ వార్నింగ్ ఇచ్చారు.
అవును... తణుకు పర్యటనలో ఉన్న చంద్రబాబు "స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంద్ర" కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా... గత ప్రభుత్వంలో సీఎం ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా? ప్రజల్లోకి వచ్చారా? వస్తే పరదాలు కట్టుకుని వచ్చేవారు.. చెట్లను నరుక్కుంటూ వచ్చేవాళ్లు.. ప్రజల సమస్యలు వినేందుకు కనీసం వారిని మాట్లాడనిచ్చేవారు కాదు అని విమర్శించారు.
అయితే.. తమది ప్రజా ప్రభుత్వమని.. ప్రజల సమస్యలు వినేందుకే తాను వచ్చానని.. పరిపాలనలో సంస్కరణలు తేవాలన్నదే తన ఏకైక లక్ష్యమని చంద్రబాబు తెలిపారు. ఈ క్రమంలో... గత ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు మిగిల్చి వెళ్లిందని మరోసారి చెప్పడం గమనార్హం. ఇప్పుడు ఆ అప్పులు తీర్చడంతోపాటు వడ్డీ కూడా కట్టాల్సి వస్తోందని చంద్రబాబు అన్నారు.
ఈ నేపథ్యంలోనే.. ప్రజలంతా స్వచ్ఛాంద్ర కోసం కంకణం కట్టుకోవాలని కోరారు. ప్రతీ ఒక్కరూ తమ తమ పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం సుమారు 45 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చారని.. కనీసం మురికి కాల్వల్లో పూడిక కూడా తీయించలేదని బాబు మండిపడ్డారు.
ఇదే క్రమంలో... అక్టోబర్ 2వ తేదీ నాటికి ఎక్కడా చెత్త లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పిన చంద్రబాబు.. 2027 నాటికి మురుగు నీటిని శుద్ధి చేసి వ్యవసాయానికి, ఇతర అవసరాలకు ఉపయోగిస్తామని అన్నారు. అక్టోబర్ 2 తర్వాత ఏ ఊరికి వస్తానో చెప్పనని.. కానీ.. పరిసరాలు శుభ్రంగా లేకపోతే మాత్రం సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
అనంతరం... పేదల పింఛన్లు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచామని.. దివ్యాంగులకు పించన్ రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచామని.. స్వర్ణాంధ్ర 2047 పేరుతో ఒక స్పష్టమైన విధానం తీసుకొచ్చామని.. ప్రజల తలసరి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో బాబు ముఖాముఖిలో పాల్గొన్నారు.