జనవరి నుంచి జన్మభూమి.. బాబు గ్రీన్ సిగ్నల్...!
తాజాగా ఆయన వచ్చే జనవరి నుంచి జన్మభూమిని ప్రారంభించనున్నట్టు చెప్పేశారు.
By: Tupaki Desk | 18 Oct 2024 10:13 AM GMTఏపీలో కూటమి సర్కారు కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఎన్నికలకు ముందు.. ప్రకటించేందు కు సంకోచించిన 'జన్మభూమి' కాన్సెప్టును తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు రెడీ అయ్యారు. తాజాగా ఆయన వచ్చే జనవరి నుంచి జన్మభూమిని ప్రారంభించనున్నట్టు చెప్పేశారు. అంటే.. 2014-19 మధ్య ప్రారంభించిన జన్మభూమి కమిటీలను తిరిగి తీసుకురానున్నారనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు వైసీపీ ఈ విషయాన్ని ప్రస్తావించింది.
జన్మభూమి కమిటీలను తీసుకువచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అప్పటి సీఎం జగన్ చెప్పుకొచ్చారు. అయితే.. ఆసమయంలో టీడీపీ నాయకులు ఎవరూ దీనిపై స్పందించలేదు. చాలా మౌనంగా ఉన్నారు. దీనికి కారణం.. ప్రజల్లో 'జన్మభూమి' కమిటీపై అనేక అపోహలు , అనుమానాలు వంటివి ఉన్నాయి. దీంతో జన్మభూమి కమిటీలు అంటేనే వివాదంగా మారాయి. 2014-19 మధ్య జన్మభూమి కమిటీలు.. చేసిన రచ్చ అంతా ఇంతా కాదనేది వైసీపీ నేతల మాట.
ఎక్కడికక్కడ ప్రజలను దోచుకున్నారన్నది కూడా అప్పట్లో వచ్చిన విమర్శలను బట్టి తెలుస్తుంది. దీంతో ఒకానొక సందర్భంలో అప్పటి సీఎం చంద్రబాబు వీటిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. నిజానికి పార్టీ కోసం పని చేసిన వారిని జన్మభూమి కమిటీల్లోకి తీసుకున్నారు. వారికి నేరుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదాయం ఉండదు. కానీ, క్షేత్రస్థాయిలో వారు చెప్పిందే వేదం.. చేసిందే రైటు అన్నట్టుగా సాగిపోయింది. ఈ పరిణామాలే అప్పటి సర్కారుకు పెద్ద తలనొప్పిగా పరిణమించాయి.
చివరకు 2019 ఎన్నికల సమయంలో జన్మభూమి కమిటీలను కూడా ప్రక్షాళన చేస్తానని చంద్రబాబు తన ప్రచారంలో చెప్పుకొచ్చారు. కానీ, ఆయన అధికారంలోకి రాలేదు. ఇక, ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో అసలు ఈ ప్రస్తావన లేకుండా ఎన్నికలకు వెళ్లారు. ఇక, ఇప్పుడు మాత్రం జన్మభూమి కమిటీలకు పచ్చ జెండా ఊపారు. ఈ కాన్సెప్టు మంచిదే అయినా.. నియంత్రణ చాలా ముఖ్యం. విచ్చలవిడితననానికి, ప్రజలపై పెత్తనం చేసేందుకు అవకాశం లేకుండా చేస్తే.. ప్రయోజనం ఉంటుంది. కానీ, గతంలో మాదిరిగా వదిలేస్తే.. మాత్రం మళ్లీ ఇబ్బందులు తప్పకపోవచ్చు!!