ఆపరేషన్ వైసీపీ ....బాబు మాస్టర్ ప్లాన్ ?
కూటమి వేవ్ కారణంగా వారు ఓటమి పాలు అయ్యారు కానీ మళ్లీ ఎన్నికలు వస్తే గెలుస్తారు అన్నది కూడా అంచనాలు ఉన్నాయి.
By: Tupaki Desk | 17 Dec 2024 7:30 PM GMTతెలుగుదేశం పార్టీ అధినేత కూటమి ప్రభుత్వ సారధి అయిన చంద్రబాబు ఒక పద్ధతి ప్రకారం వైసీపీని టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు. వైసీపీ ఓటమి పాలు అయినా అందులో బలమైన నాయకులు ఉన్నారు. వారి సొంత నియోజకవర్గంలో తమదైన ఇమేజ్ తో పాటు పలుకుబడి కలిగి ఉన్నారు. కూటమి వేవ్ కారణంగా వారు ఓటమి పాలు అయ్యారు కానీ మళ్లీ ఎన్నికలు వస్తే గెలుస్తారు అన్నది కూడా అంచనాలు ఉన్నాయి.
దాంతో అలాంటి వారిని స్ట్రాంగ్ లీడర్స్ ని ఎంపిక చేసుకుని మరీ చంద్రబాబు వారిని టీడీపీలోకి తీసుకుంటున్నారు. అలా వస్తున్న వారి పట్ల సొంత పార్టీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా కూడా చంద్రబాబు వారికి నచ్చచెప్పి మరీ పార్టీ తీర్ధం ఇస్తున్నారు. ఇలా చేయడం ఎందుకు అన్న చర్చ కూడా సాగుతోంది.
గతంలో అంటే 2014 నుంది 2019 దాకా చంద్రబాబు వైసీపీ నుంచి బలమైన నేతలను తీసుకున్నారు. అయితే వారిని తీసుకోవడం వల్ల టీడీపీలోనూ వ్యతిరేకత వచ్చింది, వర్గ పోరు హెచ్చింది. దాంతో పార్టీ 2019 ఎన్నికల్లో ఓటమి పాలు అయింది.
అయితే ఆనాడు చంద్రబాబు వైసీపీ నుంచి నేతలను తీసుకోవడానికి కారణం అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయన్న ఆశతోనే అని అంటున్నారు. అయితే అది జరగలేదు కాబట్టే అలా జరిగింది అని అంటున్నారు. అయితే ఈసారి మాత్రం పక్కాగా అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని అంటున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 లో ఏపీ అసెంబ్లీ సీట్లు 175 నుంది 225 దాకా పెరుగుతాయని అంటున్నారు. అంటే ఏకంగా యాభై సీట్లు అదనంగా పెరుగుతాయన్న మాట. మరి ఈ సీట్లు ఇంత పెద్ద మొత్తంలో పెరిగితే అది అధికారంలో ఉన్న టీడీపీకే మంచిది అని అంటున్నారు. చంద్రబాబు సైతం సీట్లు పెరిగే నియోజకవర్గాల్లో కొత్త నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు అని అంటున్నారు.
వారి రాక వల్ల ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్న వారు కానీ కీలక నేతలు కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇలా వచి చేరిన వారికి 2029 లో కొత్త నియోజకవర్గాలు కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. ఆ విధంగా వారి చేరికతో పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు వైసీపీని రెండిందాల దెబ్బ తీయాలన్న ప్లాన్ ఉందని అంటున్నారు.
ఒకటి రాజకీయంగా రెండు సామాజిక వర్గ పరంగా అని అంటున్నారు. బలమైన సామాజికవర్గానికి చెందిన నేతలను కండువాలు కప్పి టీడీపీలోకి స్వాగతం పలకడం ద్వారా ఆ సామాజిక వర్గం టీడీపీ వైపు చూస్తోంది అన్న సంకేతాలు పంపించాలన్నది కూడా ఒక ఆలోచనగా ఉంది.
అదే టైం లో రాజకీయంగా వైసీపీని బలహీనం చేసే ప్లాన్ కూడా ఇందులో ఉంది. వైసీపీకి బలమైన నేతలు ఇప్పటికే చాలా నియోజకవర్గాలలో లేకుండా పోతున్నారు అని అంటున్నారు. ఇపుడు ఉన్న వారిని లాగేస్తే రేపు 225 అసెంబ్లీ సీట్లుగా మారితే అంతమంది స్ట్రాంగ్ లీడర్స్ వైసీపీకి దొరకకుండా చేయడమే టీడీపీ ప్లాన్ అని అంటున్నారు.
అందుకే ఏలూరులో ఎంతో మంది నాయకులు నో చెప్పినా కూడా మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ నానిని పార్టీలోకి బాబు ఆహ్వానించారు అని అంటున్నారు. ఆల్ళ నానికి క్లీన్ ఇమేజ్ ఉండడంతో పాటు అంగబలం అర్ధ బలం ఉన్న నాయకుడుగా ఉన్నారు. దాంతో ఆయనకి లైన్ క్లియర్ అయింది అని అంటున్నారు.
ఇదే విధంగా గ్రంధి శ్రీనివాస్ అవంతి శ్రీనివాస్ వంటి వారిని కూడా పార్టీలో చేర్చుకుంటారని టాక్ నడుస్తోంది. మొత్తానికి కోస్తా జిల్లాలలతో పాటు ఉత్తరాంధ్రాలో వైసీపీని దెబ్బ తీసే కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది అని అంటున్నారు. మరి దీనిని ఎలా వైసీపీ అధినాయకత్వం కాచుకుని ఎత్తుకు పై ఎత్తు వేస్తుందో చూడాల్సి ఉంది.