Begin typing your search above and press return to search.

చంద్రబాబు రేవంత్ ముఖా ముఖీ తలపడతారా ?

విభజన తరువాత ఆయన ఏపీకి సీఎం అయ్యారు అంటే తన పవర్ ని సగానికి సగం తగ్గించుకున్నారు అని అప్పట్లోనే అంతా అన్నారు.

By:  Tupaki Desk   |   9 March 2025 1:00 AM IST
చంద్రబాబు  రేవంత్ ముఖా ముఖీ తలపడతారా ?
X

ఉమ్మడి ఏపీకి సీఎం గా వ్యవహరించిన వారు చంద్రబాబు. ఏకంగా 23 ఉమ్మడి జిల్లాలకు అతి పెద్ద ఆంధ్రప్రదేశ్ కి తొమ్మిదేళ్ళ పాటు నిరాటంకంగా పాలించిన చరిత్ర ఆయన సొంతం. అయితే అటువంటి బాబు కేవలం 13 ఉమ్మడి జిల్లాకే పరిమితం అయ్యారు. విభజన తరువాత ఆయన ఏపీకి సీఎం అయ్యారు అంటే తన పవర్ ని సగానికి సగం తగ్గించుకున్నారు అని అప్పట్లోనే అంతా అన్నారు.

ఇక చంద్రబాబు ఏపీకి సీఎం అయినా రెండు తెలుగు రాష్ట్రాల మేలు కోరుకుంటాను అని ఎపుడూ చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన తెలంగాణాను కూడా పాలించి ఉన్నారు కాబట్టి ఆ మాట అంటున్నారు. ఏపీలో చూస్తే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ దశలో ఉంది. ఇక గోదావరి వరద నీటిని రాయలసీమకు మళ్ళించి అక్కడ కూడా భూములను సస్యశ్యామలం చేయాలన్నది బాబు మార్క్ ఆలోచన.

ఆయన 2014 నుంచి 2019 దాకా సీఎం గా ఉన్నపుడే ఈ ప్రతిపాదన చేశారు. దానిని నాడు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ అడ్డుకుంది. నిజానికి బాబు చేస్తున్నది తప్పు కాదు. అక్రమ ప్రాజెక్ట్ అంతకంటే కాదు. ప్రతీ ఏటా గోదవారికి భారీ వరదలు వస్తాయి. అలా జూన్ జూలై ఆగస్టు మూడు నెలలలో ఉధృతంగా నీరు వచ్చి ఏపీలోని సముద్రంలో పెద్ద ఎత్తున కలసిపోతుంది.

ఈ నీటిని ఎంతో కొంత మళ్ళించి తమ కరవు ప్రాంతాలను బాగు చేసుకుందామని బాబు ఆలోచించడం మేలైన విధానమే. ఆయన ఈ మధ్యనే బనకచర్ల ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు. అది కూడా గోదావరి వరద నీటితోనే అని పదే పదే చెబుతున్నారు.

ఏటా మూడువేల టీఎంసీల గోదావరి నీరు సముద్రంలో కలసిపోతోంది. అందులో కేవలం పది శాతం అంటే 300 టీఎంసీల నీరుని తీసుకుని గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ ని చేపట్టాలని చూస్తున్నారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం దీని మీద పక్కా ప్లాన్ తో ఉంది. దీని వల్ల ఏకంగా ఏడు నుంచి ఎనిమిది లక్షల సాగు నీటికి నీరు అందిస్తారు. ఈ ప్రాజెక్ట్ తో ఏకంగా రాయలసీమలో చివరి ప్లేస్ అయిన కుప్పం దాకా నీరు పారించవచ్చు అన్నది కూటమి ప్రభుత్వ పెద్దల ఆలోచన.

అయితే దీని మీద తెలంగాణాలో రాజకీయ దుమారం రేగుతోంది. ఏపీ కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోందని అందువల్ల అడ్డుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి సహా అంతా డిమాండ్ చేస్తున్నారు. దాని మీద రేవంత్ రెడ్డి కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.

తెలంగాణాలో కొత్త ప్రాజెక్టులు పూర్తి అయ్యేంతవరకూ ఏపీ కొత్త ప్రాజెక్టులు తలపెట్టవద్దని ఆయన అంటున్నారు. అంతే కాదు గోదావరి నది మీద తెలంగాణా ప్రాజెక్టులు కడుతుందని దానికి కేంద్రం అనుమతులు ఇవ్వాలని ఆ విధంగా ఎండీయే భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కృషి చేయలాని కూడా డిమాండ్ చేస్తున్నారు.

ఏపీ గోదావరి క్రిష్ణా నదుల విషయంలో తన హక్కులను దాటి ముందుకు వెళ్తోందని కూడా తెలంగాణా రాజకీయ పార్టీలు అంటున్నాయి. దీని మీద చంద్రబాబు అసెంబ్లీలోనే వివరణ ఇచ్చారు. తాము వరద నీరుని వాడుకుంటామని అది కూడా సముద్రజలాల నుంచే అని అంటున్నారు. కానీ చూస్తూంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ సీఎం ని రెచ్చగొడుతోంది. దాంతో రేవంత్ రెడ్డి కూడా బాబు మీద విమర్శలు చేయాల్సి వస్తోంది.

మరి ఈ వ్యవహారం ఎంతదాకా వెళ్తుంది అన్నది అయితే తెలియడంలేదు అని అంటున్నారు. ఈ నీటి గొడవలు కాస్తా గురుశిష్యుల మధ్య రాజకీయ వివాదాలకు దారి తీస్తాయా అన్నది కూడా చర్చగా ఉంది. అలా జరగాలని చంద్రబాబుని రేవంత్ రెడ్డి నిలదీయాలని బీఆర్ ఎస్ నేతలు కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.